లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్ట చర్యలు
అందరికీ సమాన అవకాశాలు
గద్వాల/అలంపూర్ రూరల్/రాజోళి/అయిజ: మున్సిపల్ ఎన్నికల బ్యాలెట్ పేపర్ల లెక్కింపునకు అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. అలంపూర్ మున్సిపాలిటీ పరిధిలో పోలింగ్ సామగ్రి పంపిణీ రిసెప్షన్ సెంటర్, స్ట్రాంగ్ రూమ్, లెక్కింపు కేంద్రాలుగా అలంపూర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీని ఎంపిక చేయగా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలింగ్ సామగ్రి పంపిణీ ప్రక్రియ సజావుగా సాగేందుకు వార్డు వారీగా తగిన సంఖ్యలో కౌంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. పోలింగ్ విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అవసరమైన వసతులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. అనంతరం అలంపూర్, రాజోళి, వడ్డేపల్లి మున్సిపాలిటీల్లో పర్యటించి ఎన్నికల నిర్వహణపై అధికారులకు సూచనలు చేశారు. పోలింగ్ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్సులను నిల్వ చేసే స్ట్రాంగ్‌రూంలో బందోబస్త్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. కౌంటింగ్ హాళ్లలో టేబుల్స్, సూపర్‌వైజర్లు ఇతర సిబ్బంది నియామకంలో ఎలాంటి తప్పిదాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలన్నా రు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు, జెడ్పీ డీప్యూటీ సీఈఓ నాగేంద్రం, ఇరిగేషన్ ఎస్‌ఈ రహీముద్దీన్, తహసీల్దార్లు జ్యోతి, మంజుల, మున్సిపల్ కమిష్‌నర్లు సీహెచ్ సైదులు, శంకర్, ఈఈ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
రెండో ర్యాండమైజేషన్ పూర్తి
మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా రెండో ర్యాండమైజేషన్ ద్వారా మున్సిపాలిటీలకు పోలింగ్ అధికారుల కేటాయించినట్లు కలెక్టర్ బీఎం సంతోష్ తెలిపారు. బుధవారం ఐడీఓసీ వీడియో కాన్ఫరెన్స్‌హాల్‌లో మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ సిబ్బందికి రెండో ర్యాండమైజేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో నాలుగు మున్సిపాలిటీల్లో 77వార్డులు ఉండగా.. 189 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వర్తించేందుకు 189 పీఓలు, 189 ఓపీఓలు, 567 మంది చొప్పున మొత్తం 945 మంది ఎన్నికల సిబ్బందిని రెండో ర్యాండమైజేషన్ ద్వారా ఎంపిక చేసి మున్సిపాలిటీలకు కేటాయించినట్లు తెలిపారు.
సమాజంలో అన్ని వర్గాల ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని కలెక్టర్ బీఎం సంతోష్ తెలిపారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్య్రం రాకముందు సమాజంలో అంటరానితనం, అసమానతలు వంటి సామాజిక రుగ్మతలు ఎక్కువగా ఉండేవన్నారు. వీటిని రూపుమాపేందుకు సంఘ సంస్కర్తలు అలపెరగని పోరాటం చేశారన్నారు. ఆనాటి మహనీయులను ఆదర్శంగా తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4న సామాజిక న్యాయదినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం సామాజిక న్యాయ దినోత్సవం ప్రతిజ్ఞను చేయించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వి.లక్ష్మీనారాయణ, నర్సింగ్‌రావు, జెడ్పీడీప్యూటీ సీఈఓ నాగేంద్రం, రమేష్‌బాబు పాల్గొన్నారు.


