
సీపీఎస్ రద్దు చేసే వరకు పోరాటం
గద్వాలటౌన్: ఉద్యోగ, ఉపాధ్యాయుల పాలిట శాపంగా మారిన జీఓ 28ని తక్షణమే రద్దు చేయాలని జేఏసీ చైర్మన్ నాగర్జునగౌడ్ డిమాండ్ చేశారు. జీఓ 28ని వ్యతిరేకిస్తూ బాధిత ఉద్యోగ, ఉపాధ్యాయులంతా తమకు న్యాయం చేయాలని, తమ ఉద్యోగ జీవితాలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ శనివారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఆయా శాఖల కార్యాలయాల వద్ద ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి, ఫ్లకార్డులు చేతపట్టి నిరసన వ్యక్తం చేశారు. జాక్టో, జేఏసీ వేరువేరుగా పెన్షన్ విద్రోహ దినం, బ్లాక్ డే కార్యక్రమాలు చేపట్టారు. జీఓ ప్రతులను దహనం చేసి నిరసన తెలిపారు. సీపీఎస్ వద్దు – ఓపీఎస్ ముద్దు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేయకుంటే ప్రభుత్వంపై సమరం సాగిస్తామని జేఏసీ నేతలు హెచ్చరించారు.
సంఘటితంగా ఉద్యమించాలి
సీపీఎస్ రద్దు కోసం శాంతియుతంగా ఉద్యమాలు చేసి సాధించుకోవాలని, ఇందుకు ప్రతి ఒక్కరూ చొరవ తీసుకొని సంఘటితంగా పోరాడాలని జేఏసీ చైర్మన్ నాగర్జునగౌడ్, టీఎన్‌జీఓ రాష్ట్ర నాయకుడు భీమన్న పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని సీపీఎస్ అధ్యక్షుడు నాగరాజు, విష్ణు డిమాండ్ చేశారు.