
పండుగలు ప్రశాంతంగా జరుపుకోవాలి
గద్వాల: ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి, మిలాద్–ఉన్–నబీ వేడుకలు నిర్వహించేలా అధికారులు అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బీఎం సంతోష్ ఆదేశించారు. శనివారం ఐడీవోసీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌హాలులో ఎస్పీ శ్రీనివాస్‌రావుతో కలిసి అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్సవాల నిర్వహణకు జిల్లా అధికార యంత్రాంగం సంసిద్ధంగా ఉండి అన్ని రకాల ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. అదేవిధంగా దెబ్బతిన్న రోడ్లకు వెంటనే తాత్కాలిక మరమ్మత్తులు చేపట్టాలన్నారు. ఈవేడుకలు ప్రతి ఎడాది మాదిరిగానే సహృద్భావ వాతావరణంలో జరిగేలా అందరూ స్ఫూర్తిని కొనసాగించాలన్నారు. ఈసారి కూడా వినాయక నిమజ్జనం, మిలాద్–ఉన్–నబీ వేడుక ఒకేసారి వస్తున్నందున ఎక్కడా కూడా చిన్నపాటి అవాంఛనీయ ఘనటలకు తావులేకుండా పోలీసుశాఖ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
హైరిస్క్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించండి
గర్భిణులలో హైరిస్క్ కేసులను ముందస్తుగానే గుర్తించి ప్రత్యేక దృష్టి సారించాలని, మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఒంటెలపేటలోని అర్బన్‌హెల్త్‌సెంటర్‌ను ఆకస్మికంగా సందర్శించారు. సిబ్బంది హాజరు, ఓపి వివరాలు వ్యాక్సినేషన్, మందుల పంపిణీ వంటి అంశాలను పరిశీలించారు. ప్రభుత్వ ఆసుపత్రులలోనే ప్రసవాలు జరిగేలా అవగాహన కల్పించాలని, రక్తహీనతతో బాధపడుతున్న ప్రతిఒక్కరికి పౌష్టికాహారం అందించాలన్నారు. అవసరమైన వారికి ప్రభుత్వ ఆసుపత్రులలోనే వైద్యసేవలు అందించాలన్నారు. ఇమ్యునైజేషన్ నిరంతరం కొనసాగించాలన్నారు. మలేరియా, డెంగీ, చికెన్‌గున్యా వంటి సీజనల్ వ్యాధుల నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్ సిద్ధప్ప, డాక్టర్ మాధుర్య, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
ప్రమాదాలు చోటు
చేసుకోకుండా జాగ్రత్తలు
ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నందున ప్రమాదాలు చోటుచేసుకోకుండా వినాయక మండపాల ఏర్పాటులో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, నిమజ్జన కార్యక్రమంలో గుర్తించిన బీచుపల్లి, నదీఅగ్రహారం, జమ్మిచేడు, జూరాల ప్రాంతాల్లో పోలీసు, రెవెన్యూ శాఖలు అప్రమత్తంగా ఉండి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలన్నారు. క్రేన్, లైటింగ్‌వ్యవస్థ, వైద్యశిబిరాలు, బారికేడ్లు, ట్రాఫిక్‌క్రమబద్దీకరణ, పారిశుద్ధ్యం వంటి చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం పొల్యూషన్ శాఖ ఆధ్వర్యంలో ముద్రించిన పర్యావరణ పరిరక్షించేలా మట్టివిగ్రహాలు వినియోగించేలా అవగాహన కల్పించాలన్నారు. ఇందుకు సంబంధించి మట్టివిగ్రహం పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఎస్పీ శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ జిల్లాలో భారీవర్షాల కారణంగా చెరువులు, కుంటలు పూర్తిస్థాయి నీటితో నిండుగా ఉన్నాయని నిమజ్జనం సమయంలో ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా కట్టుదిట్టమైన భద్రతాఏర్పాట్లు చేపట్టనున్నట్లు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు వి.లక్ష్మీనారాయణ, నర్సింగ్‌రావు, డీఎంహెచ్‌వో డాక్టర్ సిద్దప్ప, విద్యుత్తు శాఖ డీఈ తిరుపతిరావు, డీఎస్పీ మొగులయ్య, ఇరిగేషన్‌వాఖ అఽధికారి శ్రీనివాస్‌రావు, మత్య్సశాఖ అధికారి షకీలాభాను, తహసీల్దార్లు పాల్గొన్నారు.