
ప్రజల దీవెనతో ప్రజాపాలన
అమ్రాబాద్/వెల్దండ: ప్రజా పాలనలో ప్రజల ప్రభుత్వం పనిచేస్తుందని, ప్రజల దీవెనలతో అన్నివర్గాల ప్రజలు, అన్నిరంగాల అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తోందని రాష్ట్ర పంచాయతీ రాజ్, సీ్త్ర శిశు సంక్షేమ, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జంగంరెడ్డిపల్లిలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. గ్రామాలు బాగుండాలని ప్రభుత్వం పనుల జాతర కార్యక్రమంలో భాగంగా మొత్తం 1,500 పనులకు గాను రూ.20,200 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఈ నిధులతో గ్రామ పంచాయతీ, అంగన్‌వాడీ భవనాలు తదితర అభివృద్ధి పనులు చేపట్టవచ్చన్నారు. ముఖ్యంగా మహిళా సంఘాల అభివృద్ధి కోసం ఇప్పటికే ప్రభుత్వం క్యాంటీన్లు, పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసి మహిళలు ఆర్థిక స్వావలంభన సాధించే దిశగా ప్రోత్సహిస్తుందని చెప్పారు. గత ప్రభుత్వం మహిళలకు పావలా వడ్డీ రుణాలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని, కానీ, తమ ప్రజల ప్రభుత్వం మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తుందని పేర్కొన్నారు. గతంలో 60 ఏళ్లు దాటిన మహిళలను తొలగించారని, ఇప్పుడు వారిని కూడా చేర్చుకోవాలని తాము చెబుతున్నామన్నారు. చదువుతోనే పేదరిక నిర్మూలన సాధ్యమని మంత్రి సీతక్క అన్నారు. మహిళలు స్వయం ఉపాధి రంగాలను ఎంచుకోని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, తమ పిల్లలను ఉన్నత చదువులను చదివించాలని సూచింజుచారు. ఆయా కార్యక్రమంల్లో అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, అదనపు కలెక్టర్ దేవసహాయం, డీఆర్‌డీఓ ఓబులేష్, గ్రంథాలయ చైర్మన్ రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.