
త్వరలో మద్యం టెండర్లు!
నవంబర్‌తో ముగియనున్న పాత లైసెన్స్ గడువు
● పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ముందస్తు టెండర్లు నిర్వహించే అవకాశం
● దరఖాస్తు ఫీజు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంపు
● జిల్లాలో 36 మద్యం దుకాణాలు
దరఖాస్తులు ఎక్కువే...
జిల్లాలో గతంలో నిర్వహించిన మద్యం దుకాణాల టెండర్లలో దరఖాస్తులు వెల్లువలా వచ్చాయి. ఈసారి కూడా మద్యం షాపులకు పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. టెండర్లలో పాల్గొనేందుకు రెండు రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు బృందాలుగా ఏర్పడి పోటీ పడ్డారు. 10 నుంచి 20 షాపులకు టెండర్లు వేశారు. అయితే లక్కీ డిప్‌లో షాపులు దక్కని వారు డిప్‌లో వచ్చిన వారి నుంచి గుడ్‌విల్‌తో చేజిక్కించుకున్నారు. 2023లో జిల్లాలోని 36 మద్యం దుకాణాల కోసం వ్యాపారులు 1,171 టెండర్లు దాఖలు చేశారు. ఈ దరఖాస్తుల రూపంలో ప్రభుత్వానికి రూ.23.42 కోట్లు సమకూరింది.
డిపాజిట్ ధర పెంపు..?
గతంలో టెండర్‌లో పాల్గొనాలంటే దరఖాస్తుకు రూ.2 లక్షలు డీడీ చెల్లించాలనే నిబంధనతో పాటు లక్కీ డీప్ ద్వారా దుకాణం కేటాయిస్తారు. డీడీల రూపంలో వ్యాపారులు చెల్లించిన డబ్బులు తిరిగి రాదు ప్రభుత్వానికే చెందుతుంది. అయితే తాజాగా దరఖాస్తుల ధరను మరింతగా పెంచి ప్రభుత్వం అదనపు ఆదాయం సమకూర్చుకునే పనిలో పడింది. దరఖాస్తు ఫారం ధరను రూ.2 లక్షల నుంచి రూ. 3లక్షలకు పెంచే అవకాశం ఉంది.
గద్వాల క్రైం: త్వరలోనే మద్యం దుకాణాల టెండర్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే యోచనలో ఉంది. దరఖాస్తు ఫీజులను సైతం పెంచనుంది. జిల్లాలో గద్వాల – అలంపూర్ సెగ్మెంట్‌లలో 36 మద్యం దుకాణాల గడవు మరో నాలుగు నెలల్లో ముగుస్తుంది. దీనికి తోడు పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ సెప్టెంబర్ నెలాఖరు నాటికి పూర్తి చేయాల్సిన నేపథ్యంలో మద్యం షాపులకు టెండర్ల ప్రక్రియను ముందస్తుగా చేపట్టే అవకాశం ఉంది. 2023లో ఆగస్టు 21న టెండర్లు పిలిచి డ్రా తీశారు. డిసెంబర్ 1 నుంచి కొత్త మద్యం దుకాణాల నిర్వాహకులు క్రయవిక్రయాలు ప్రారంభించారు. ప్రస్తుతం జిల్లాలోని 36 మద్యం దుకాణాల లైసెన్స్ గడువు నవంబర్ 30వ తేదీన ముగియనుంది. ఈ నేపథ్యంలో మళ్లీ టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

త్వరలో మద్యం టెండర్లు!