
ఇంకా పునరుద్ధరించలే!
సాక్షి, నాగర్‌కర్నూల్: శ్రీశైలం ఎడమగట్టు భూగర్భజల విద్యుత్ కేంద్రంలో జరిగిన ఘోర ప్రమాద ఆనవాళ్లు నేటికీ చెదిరిపోవడం లేదు. 2020 ఆగస్టు 20న రాత్రి నాలుగో యూనిట్‌లో చోటుచేసుకున్న షార్ట్‌సర్క్యూట్ కారణంగా..
రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ వెలుగులు ప్రసరింపజేసే భూగర్భ కేంద్రంలో చీకట్లు కమ్ముకున్నాయి. ప్రమాదం కారణంగా చెలరేగిన మంటలు, పొగలతో ఉక్కిరిబిక్కిరికి గురై డ్యూటీలో ఉన్న తొమ్మిది మంది ఉద్యోగులు మరణించారు. తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ అందిస్తున్న శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలోని నాలుగో యూనిట్ ప్యానెల్ బోర్డులో షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగడం, చుట్టూ మంటలు, పొగలో చిక్కుకుని ఏడుగురు జెన్‌కో ఉద్యోగులు, ఇద్దరు అమరాన్ బ్యాటరీ కంపెనీకి చెందిన ఉద్యోగులతో సహా మొత్తం తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా.. ప్రమాదం సంభవించిన నాలుగో యూనిట్‌ను నేటికీ పునరుద్ధరించకపోవడం కొసమెరుపు.
ఇదే తొలి ప్రమాదం..
శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో 2001 ఫిబ్రవరిలో ఒక యూనిట్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు. ఈ కేంద్రంలో మొత్తం 6 యూనిట్లకు గానూ ఒక్కో యూనిట్ 150 మెగావాట్ల చొప్పున మొత్తం 900 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం ఉంది. 2020 వరకూ ఈ కేంద్రంలో పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తి కొనసాగింది. 24 గంటల వ్యవధిలో 6 యూనిట్ల ద్వారా 21 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేసేవారు. అయితే ఐదేళ్ల క్రితం జరిగిన ప్రమాదంలో నాలుగో యూనిట్ పూర్తిగా ధ్వంసం కాగా.. ఇప్పటి వరకు ఈ యూనిట్ పునరుద్ధరణ పూర్తికాలేదు. అయితే భూగర్భ కేంద్రం చరిత్రలోనే ఇదే తొలి ప్రమాదం కావడం గమనార్హం.
ఐదేళ్లుగా సా..గదీత
ప్రమాదం జరిగినప్పటి నుంచి నాలుగో యూనిట్ పునరుద్ధరణ పనులను చేపట్టినా ఇప్పటి వరకు అధికారులు అందుబాటులోకి తీసుకురాలేకపోయారు. పూర్తిగా ధ్వంసమైన నాలుగో యూనిట్‌ను పునరుద్ధరణ పనులు రెండేళ్ల కిందట పూర్తిచేసినా, సాంకేతిక సమస్యలతో విద్యుదుత్పత్తి చేపట్టడం లేదు. గతేడాది డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఈ కేంద్రాన్ని సందర్శించి నాలుగో యూనిట్ పునరుద్ధరణ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. కేంద్రం పూర్తి విద్యుదుత్పత్తి సామర్థ్యం 900 మెగావాట్లు కాగా.. ప్రస్తుతం ఐదు యూనిట్ల ద్వారా 750 మెగావాట్ల సామర్థ్యంతోనే విద్యుదుత్పత్తి కొనసాగుతుంది. నాలుగో యూనిట్‌ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తేనే గరిష్ట స్థాయిలో విద్యుదుత్పత్తి చేసే అవకాశం ఉంది.
ఈ విషయమై శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రం సీఈ సత్యనారాయణను సంప్రదించగా నాలుగో యూనిట్ పునరుద్ధరణ పనులు 24 గంటల పాటు కొనసాగుతున్నాయని, మరో నెల రోజుల్లో విద్యుదుత్పత్తి చేపట్టేలా కృషిచేస్తామన్నారు.
శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో సిద్ధంకాని నాలుగో యూనిట్
2020 ఆగస్టు 20 నాటి దుర్ఘటనలో 9 మంది ఉద్యోగుల మృతి
ఏళ్లతరబడిగా సాగుతున్న మరమ్మతు ప్రక్రియ
ప్రస్తుతానికి ఐదు యూనిట్లతోనే విద్యుదుత్పత్తి