
రక్తదానం.. మరొకరికి ప్రాణదానం
గద్వాలటౌన్: రక్తదానం చేస్తే ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి పునర్జన్మను ఇచ్చినట్లేనని సీఐ శ్రీనివాస్ పేర్కొన్నారు. బ్రహ్మకుమారి దాది ప్రకాష్‌మణి వర్ధంతిని పురస్కరించుకుని విశ్వబంధుత్వ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివారం స్థానిక రాజయోగ సేవ కేంద్రంలో ఆవరణలో బ్రహ్మకుమారీస్ ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రక్తదానం అన్ని దానాల కన్నా మిన్న అని, ఆపత్కాకాలంలో అవసరమైన రక్తాన్ని అందించి ప్రాణాన్ని రక్షించవచ్చవన్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి సకాలంలో రక్తం లభించక మృతి చెందిన సంఘటనలు నిత్యం చోటు చేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బ్రహ్మకుమారీ ప్రతినిధి బీకే మంజుల మాట్లాడుతూ సమాజ హిత కార్యక్రమాల్లో బ్రహ్మకుమారీల భాగస్వామ్యం పెరిగిందని చెప్పారు. అవకాశం లభించినప్పుడల్లా ప్రతి ఒక్కరూ సామాజిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ సోసైటీ ప్రతినిధులు రమేష్, అయ్యప్పురెడ్డి తదితరులు పాల్గొన్నారు.