
‘ఇందిరమ్మ ఇళ్ల’ ఇసుక టిప్పర్ల నిలిపివేత
రాజోళి: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసం ఇసుకను తరలిస్తున్న టిప్పర్లను మండలంలో పలు చోట్ల నిలిపేశారు.జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం రాజోళి మండలంలోని తుమ్మిళ్ల గ్రామంలో ఇసుక రీచ్‌ను ఏర్పాటు చేశారు. కాగా ఆన్‌లైన్‌లో ఇసుకను బుక్ చేసుకున్న వారి కోసం అక్కడి నుంచి ఇసుకను పడమటి గార్లపాడు,రాజోళి మీదుగా తరలిస్తున్న క్రమంలో పడమటి గార్లపాడు,కొత్త రాజోళిలో శుక్రవారం, శనివారం నిలిపేశారు. తమ గ్రామాల మీదుగా టిప్పర్లు వెళితే రోడ్లు దెబ్బతింటాయని, దెబ్బతిన్న రోడ్లకు బాధ్యులెవరని అంటూ వాహనాలను నిలిపేశారు. 20 టన్నుల బరువుతో టిప్పర్లు వెళితే రోడ్లు పూర్తిగా దెబ్బతింటాయని తమ గ్రామాల మీదుగా తిరగనివ్వమని వాపోయారు. ఇతర గ్రామాల గుండా వెళ్లమని చెప్పామని, అయినా ఇదే మార్గంలో బుకింగ్ ఉందని టిప్పర్లు తిరగడంతో వాటిని నిలిపేశామని ఆయా గ్రామాల వాసులు తెలిపారు.