
పారదర్శక పాలనకే సమాచార హక్కుచట్టం
గద్వాల/అలంపూర్: పారదర్శకమైన పాలన కోసమే 2005లో అప్పటి కేంద్ర ప్రభుత్వం సమాచార హక్కుచట్టం తీసుకురావడం జరిగిందని కలెక్టర్ బీఎం సంతోష్, సమాచారహక్కు చట్టం కమిషనర్లు పీవీ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం వారు గద్వాలకు వచ్చిన నేపథ్యంలో ఐడీవోసీ కార్యాలయంలో వివిధ శాఖలకు చెందిన అధికారులతో సమాచారం హక్కు చట్టంపై సమీక్షించారు. ఈసందర్బంగా ముందుగా పీవీ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సిటిజన్ చార్ట్‌ను తప్పనిసరిగా ప్రదర్శించాలన్నారు. పౌరులకు పారదర్శక, బాధ్యతాయుత పాలన అందించడలంలో సమాచార హక్కుచట్టం కీలకపాత్ర పోషిస్తుందన్నారు. ఆర్టీఐ దరఖాస్తులు ఫిర్యాదులు తక్కువ అందిన జిల్లాలో జోగుళాంబగద్వాల జిల్లా ఒకటన్నారు. పీఐవో అధికారులు ప్రజలకు సమయానికి పూర్తి సమాచారాన్ని అందించాలని సూచించారు. ఆర్‌టీఐ దరఖాస్తుల పరిష్కారం ఆలస్యం కాకుండా చట్టంలో ఉన్న సమయపాలనతో కూడిన సమాచారం ఇవ్వాలన్నారు. గత మడు సంవత్సరాల నుంచి 17వేల ఆర్‌టీఐ కేసులు పెండింగులో ఉన్నాయని వీటిని త్వరితగతిన పరిష్కరించేందుకు జిల్లాల పర్యటన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. అనంతరం కలెక్టర్ బీఎం సంతోష్ మాట్లాడుతూ.. సమాచార హక్కు చట్టంపై ప్రతిఒక్క అధికారి అవగాహన పెంచుకోవాలని, ఆర్టీఐ అప్పీల్ కేసులను పరిష్కరించటానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ఆర్టీఐ కింద అడిగిన సమాచారాన్ని తప్పకుండా నిర్ణీత గడువులోలప ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో సమాచార హక్కు చట్టం కమిషన్ కమిషనర్లు దేశాల భూపాల్, వైష్ణవి, అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ, ఆర్డీవో అలివేలు, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
జోగుళాంబ ఆలయంలో ప్రత్యేక పూజలు
అలంపూర్ జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను సమాచార హక్కు చట్టం కమిషనర్లు పీవీ శ్రీనివాస్ రావు, వైష్ణవి మెర్ల, బోరెడ్డి అయోధ్య రెడ్డి, దేశాల భూపాల్‌రావు శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం క్షేత్రంలోని ఆలయాల్లో అర్చనలు, అభిషేక పూజలు నిర్వహించారు. దేశంలోనే ఐదో శక్తిపీఠంగా ప్రసిద్ధి చెందిన జోగుళాంబ అమ్మవారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని వారు తెలిపారు.