
అభివృద్ధికి పెద్దపీట
గద్వాల: రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి పెద్దపీట వేసిందని ఇందులో భాగంగానే ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పనుల జాతర–2025 చేపట్టినట్లు కలెక్టర్ బీఎం సంతోష్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం వారు గద్వాల మండలం జిల్లెడబండతండాలో నూతన గ్రామ పంచాయతీ భవననిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ ఉపాధిహామీ పథకం కింద గత సంవత్సరం రూ.13 కోట్లతో గద్వాల నియోజకవర్గంలో వివిధ రకాల అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేయడం జరుగుతుందన్నారు. ఈ సంవత్సరం కూడా వంద రోజుల పనిదినాలు కల్పించి కొత్త పనులు చేపట్టనున్నట్లు తెలియజేశారు. గ్రామీణ ప్రాంత ప్రజలు ఉపాధి కోసం వలసలు వెళ్లకుండా ఉపాధి హామీ పథకం కింద పని కల్పించనున్నట్లు తెలిపారు. గ్రామంలో 900 మంది ఉన్నారని గ్రామానికి అవసరమైన సీసీ రోడ్లు, మరుగుదొడ్లు, గ్రామపంచాయతీ భవనాలు, అంగన్‌వాడీ భవనాలు, గ్రామాలలో మౌళికవసతుల కల్పన వంటి ముఖ్యమైన అభివృద్ధిపనులు చేయనున్నట్లు తెలిపారు. రూ.20 లక్షలతో గ్రామంలో కొత్తగా గ్రామ పంచాయతీ భవనాలు శంకుస్థాన చేసుకోవడం జరిగిందన్నారు. చేపట్టిన పనులు వచ్చేడాది మార్చి వరకు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య పనులు చేపట్టాలన్నారు. అనంతరం ఉత్తమ సేవలు అందించిన పారిశుద్ధ్య కార్మికులకు సన్మానించారు. గ్రామంలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకున్న లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు, ఎంపీడీవో ఉపాదేవి, పీఆర్ డీఈ కబీర్‌దాస్, ఏఈ బషీర్, పీఎస్ కార్యదర్శి కవిత, మహిళా సంఘం అధ్యక్షురాలు జ్యోతి, నాయకులు పాల్గొన్నారు.