
ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి
● వైద్యులు, వైద్యసిబ్బంది తప్పక బయోమెట్రిక్ ద్వారా హాజరు వేయాలి
● ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలి
● కలెక్టర్ బీఎం సంతోష్
గద్వాల: జిల్లాలో వైద్యులు, వైద్యసిబ్బంది.. ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ బీఎం సంతోష్ ఆదేశించారు. గురువారం ఐడీవోసీ కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని రకాల వైద్యసదుపాయాలు కల్పించి ప్రజలకు మరింత మెరుగైన వైద్యం అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. అదేవిధంగా వైద్యులు, వైద్యసిబ్బంది తప్పక బయోమెట్రిక్ ద్వారా హాజరు నమోదు చేయాలన్నారు. ఈ నెలాఖరుకు అన్ని రిజిస్ట్రేషన్ ఎన్రోల్‌చేసి సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ప్రతిఒక్కరు బయోమెట్రిక్ అమలు చేయాలన్నారు. ప్రోగ్రాం ఆఫీసర్లు ప్రతి రెండుసార్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను క్షేత్రస్థాయిలో సందర్శించాలన్నారు. క్షేత్రస్థాయి పర్యటన సమయంలో ప్రోగ్రాం అధికారులు హైరిస్క్ రోగులను గుర్తించి వారికి అవసరమైన మెరుగైన వైద్యసేవలు అందించాలన్నారు. అన్ని ఆసుపత్రులలో డెలివరీల సంఖ్య పెంచాలన్నారు. సమావేశంలో డీఎంహెచ్‌వో డాక్టర్ సిద్దప్ప, ప్రోగ్రాం అధికారి డాక్టర్ సంధ్యారాణి, మెడికల్ ఆఫీసర్లు, హెల్త్‌సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.
చేనేత రుణమాఫీకి ప్రతిపాదనలు
జిల్లాలో చేనేత కార్మికులకు రూ.11.51 కోట్ల వ్యతిగత రుణమాఫీకి సంబంధించిన ప్రతిపాదనలు రారష్ట్‌ర స్థాయి కమిటీకి పంపుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈమేరకు అధికారులతో మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 1496మంది చేనేత కార్మికుల పెండింగ్ రుణాలు రూ.9,94,83,283 ఉన్నాయన్నారు. 265మంది కార్మికులకు రూ.1,81,10,500 కలిపి మొత్తం రూ.11.751కోట్లు మాఫీ చేయాలని జిల్లా స్థాయి కమిటీ ఆమోదించిందన్నారు. ఈ సిఫారసులను తదుపరి చర్యల కోసం రాష్ట్ర స్థాయికమిటీకి పంపుతున్నట్లు తెలిపారు. అన్ని జాతీయ బ్యాంకులు, జిల్లా సహకార బ్యాంకులు చేనేత కార్మికులపై బ్రోకెన్ పీరియడ్ వడ్డీతో సహా మొత్తం రూ.68,58,334 వడ్డీని మాఫీ చేయాలని కమిటీ నిర్ణయించినట్లు తెలిపారు. చేనేత కార్మికుల సంక్షేమార్థం ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక రుణమాఫీ నిర్ణయం వందలాది కుటుంబాలకు ఆర్థిక భారం నుంచి ఉపశమనం కలిగిస్తుందన్నారు. బ్యాంకులు సంపూర్ణ సహకారం అందించి వారి భవిష్యత్తు భద్రతకు తోడ్పాడాలన్నారు. సమావేశంలో ప్రాంతీయ డిప్యూటీ డైరెక్టర్ పద్మ, ఏడీ గోవిందయ్య, లీడ్‌బ్యాంక్ మేనేజర్ శ్రీనివాసరావు, జీఎం రామలింగేశ్వర్‌గౌడ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.