
కేసుల విచారణ వేగవంతం
గద్వాల క్రైం: శాంతిభద్రతల విషయంలో అప్రమత్తంగా ఉంటూ అనుమానాస్పద కేసులపై వేగవంతంగా విచారణ చేపట్టాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమస్యలపై వచ్చే బాధితులకు న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. గణేష్ మండపాల కోసం నిర్వాహకులు పోలీసుశాఖ అనుమతి తీసుకోవాలని, ఉత్సవాలు పూర్తి అయ్యేవరకు నిత్యం నిఘా ఉంచాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక విచారణ చేపట్టాలన్నారు. అనుమతి లేకుండా ఇసుక, మట్టి, రేషన్ బియ్యం, నిషేధిత మత్తు పదార్థాల వంటి వాటిని కట్టడి చేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఇసుక తరలింపు విషయంలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కేసుల విషయంలో నిర్లక్ష్యం లేకుండా వీలైనంత త్వరగా కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేసి నిందితులకు శిక్ష పడేలా వ్యవహరించాలన్నారు. అనంతరం ఆయా స్టేషన్‌లలో నమోదైన కేసులపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. డ్రగ్ రహిత సమాజ స్థాపనలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాల్సిందిగా పిలుపునిచ్చారు. సమావేశంలో డీఎస్పీ మొగిలయ్య, సీఐ టాటాబాబు, శ్రీను, రవిబాబు, ఎస్‌ఐలు, కళ్యాణ్‌కుమార్, శ్రీకాంత్, వేంకటేష్, శ్రీనివాసులు, మల్లేష్, శ్రీహరి, నందికర్ పాల్గొన్నారు.