
యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు
గద్వాలన్యూటౌన్: జిల్లాలో యూరియా సమస్య తీరడం లేదు. వారం రోజులుగా యూరియా కోసం రైతులు నానా అవస్థలు పడుతున్నారు. పీఏసీఎస్‌ల వద్ద గంటల తరబడి క్యూ కడుతున్నారు. అయినప్పటికీ యూరియా లభించకపోవడంతో రోడ్డెక్కి ఆందోళనకు దిగుతున్నారు. మంగళవారం అయిజ, గట్టు, కేటీదొడ్డి మండలాల్లో రైతులు ఆందోళనకు దిగగా.. తాజాగా జిల్లా కేంద్రంలో రైతులు రోడ్డెక్కారు. బుధవారం స్థానిక పీఏసీఎస్ కార్యాలయానికి రైతులు యూరియా కోసం వచ్చారు. అయితే స్టాక్ లేదని అధికారులు చెప్పడంతో ఆగ్రహించిన అన్నదాతలు.. అంబేడ్కర్ చౌరస్తా వద్ద రాస్తారోకో చేపట్టారు. యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని.. రోజల తరబడి ఎదురుచూడాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. యూరియా చల్లకపోవడం వల్ల మొక్కల పెరుగుదల మందగించి.. దిగుబడులు తగ్గే ప్రమాదం ఉందని వాపోయారు. రైతులకు బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి బాసు హనుమంతు నాయుడు, ఇతర నాయకులు సంఘీభావం తెలిపారు. గంట పాటు రైతులు చేపట్టిన ఆందోళనతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. విషయం తెలుసుకున్న డీఎస్పీ మొగిలయ్య పోలీసులతో అక్కడికి చేరుకొని రైతులను శాంతింపజేశారు.
22 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ..
రైతుల ఆందోళన విషయం తెలుసుకున్న పీఏసీఎస్ చైర్మన్ సుభాన్ అక్కడికి చేరుకొని విషయాన్ని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే కలెక్టర్‌తో మాట్లాడి రైతుల సమస్యను వివరించడంతో 22 మెట్రిక్ టన్నుల యూరియాను గోదాముకు పంపించారు. దీంతో పీఏసీఎస్ అధికారులు రైతులకు టోకెన్లు అందించి.. యూరియా పంపిణీ చేశారు.
● పీఏసీఎస్ కార్యాలయాన్ని ఎస్పీ శ్రీనివాసరావు సందర్శించి రైతులకు టోకెన్ల పంపిణీ విధానాన్ని పరిశీలించారు. నిల్వ ఉన్న యూరియాను నిబంధనలకు అనుగుణంగా పంపిణీ చేయాలని అధికారులకు సూచించారు. ఎరువుల కృత్రిమ కొరత తలెత్తకుండా జాగ్రత్త వహించాలన్నారు. ఎస్పీ వెంట డీఎస్పీ మొగిలయ్య, పట్టణ ఎస్‌ఐ కళ్యాణ్‌కుమార్, వ్యవసాయశాఖ అధికారులు ఉన్నారు.
జిల్లా కేంద్రంలో గంట పాటు ఆందోళన
ఎమ్మెల్యే చొరవతో 22 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ

యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు