
ఎరువుల కొరత ఉండొద్దు : కలెక్టర్
గద్వాల: రైతులకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉండాలని.. ఎట్టి పరిస్థితుల్లోనూ కొరత ఉండొద్దని కలెక్టర్ బీఎం సంతోష్ ఆదేశించారు. బుధవారం ఐడీఓసీలోని కాన్ఫరెన్స్ హాల్‌లో సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం జిల్లాలో 543 మెట్రిక్ టన్నుల యూరియాను అవసరమున్న రైతులకు మాత్రమే పంపిణీ చేయాలన్నారు. యూరియా పంపిణీలో అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాకు వచ్చే యూరియాను పూర్తిగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారానే రైతులకు అందజేయాలని.. ఇతర ఆగ్రో షాపులకు కేటాయించరాదన్నారు. గతేడాది కంటే ఈ సారి 600 మెట్రిక్ టన్నుల యారియాను ఎక్కువగా విక్రయించడం జరిగిందని, అయినప్పటికీ యూరియా కొరతకు గల కారణాలపై సమగ్ర విచారణ జరపాలని కలెక్టర్ ఆదేశించారు. ఎరువులు పక్కదారి పట్టకుండా పర్యవేక్షణ చేయాలన్నారు. అదే విధంగా రైతులు కూడా తమకు అవసరమైనంత మేరకే ఎరువులు వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఒకసారి తీసుకున్న రైతులకు మళ్లీ ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఏఓ సక్రియా నాయక్, ఏడీఏ సంగీతలక్ష్మి తదితరులు ఉన్నారు.
కలెక్టర్ బీఎం సంతోష్