
‘ఆత్మీయ భరోసా’ అమలులో విఫలం
అలంపూర్: ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలులో ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రాజు విమర్శించారు. అలంపూర్‌లోని కేవీపీఎస్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జీఓ 42 ప్రకారం ఉపాధి హామీ పథకం కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా ఆర్థిక చేయూత అందించాల్సి ఉండగా.. పథకం అమలులో తీవ్ర జాప్యం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో 5లక్షల మంది లబ్ధిదారులను ఎంపికచేసి.. కేవలం 83వేల మందికి రూ. 50.33కోట్లు చెల్లించారని తెలిపారు. మిగిలిన 4,13,658 మందికి రూ. 250కోట్లు చెల్లించాల్సి ఉండగా.. ప్రస్తుతం మరో 2లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. ప్రభుత్వం మాత్రం లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేయడం లేదన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం లబ్ధిదారులకు ఆత్మీయ భరోసా అందించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఆ సంఘం జిల్లా ఉ పాధ్యక్షుడు రాఘవేంద్ర యాదవ్, నర్సింహ ఉన్నారు.