
సం‘పత్తి’ కలిగేనా..!?
నడిగడ్డలో అత్యధికంగా సీడ్ పత్తి సాగు
గట్టు: పేరెన్నిక కల్గిన పత్తి విత్తనాలను అందించడంలో నడిగడ్డ ప్రాంతం రాష్ట్రంలోనే పేరుగాంచింది. అయితే, ఈ ఏడాది సీడ్ పత్తి రైతును ఎడతెరిపి లేని వర్షాలు.. మధ్యవర్తుల కొత్త నిబంధనలు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. భారీ వర్షాలతో క్రాసింగ్ చేసినవి కాయలుగా మారకుండా రాలిపోతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు ఎకరాకు కేవలం 150 నుంచి 200 ప్యాకెట్ల విత్తనాలు మాత్రమే కొంటామని.. అంతకుమించి సాగుచేస్తే కొనమని మధ్యవర్తులు చెబుతుండడం కలవరపెడుతోంది. విధిలేని పరిస్థితుల్లో కొంతమంది రైతులు మధ్యలోనే పంట వదిలేస్తుండగా.. మరికొందరు యథావిధిగా సాగు చేస్తున్నారు. మొత్తంగా ఈ ఏడాది పత్తి సాగు చేసిన రైతుల శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతుందా.. లేదా అన్న అనుమానం నెలకొంది. జిల్లా వ్యాప్తంగా పత్తివిత్తనోత్పత్తి సాగు 22,783 ఎకరాల్లో, కమర్షియల్ పత్తి 1,05,101 ఎకరాల్లో సాగు అవుతోంది.
ఎడతెరిపి లేని వర్షాలతో ముప్పు..
ఎకరా సీడ్‌పత్తిని సాగు చేస్తే పెట్టుబడిగా రూ.లక్ష నుంచి 1.5 లక్షల వరకు పెట్టుబడి పెడతారు. జూన్‌న్ ప్రారంభంలో పత్తివిత్తనోత్పత్తిని సాగు చేస్తుండగా, జూలై చివరి వారం నుంచి క్రాసింగ్ పనులు (మగ పువ్వు పుప్పొడిని ఆడ పువ్వుతో క్రాసింగ్) ప్రారంభిస్తారు. ఇలా 30 నుంచి 60 రోజుల పాటు క్రాసింగ్ పనులను చేపడతారు. ఇలా ఆరుమాసాల్లో పంటకాలం పూర్తి చేస్తారు. ఈ క్రాసింగ్ పనులకు ఎకరాకు 5 నుంచి 7 మంది కూలీల దాకా అవసరం అవుతారు. వీరికి నెలకు రూ.18వేల నుంచి రూ.21 వేల వరకు కూలీ చెల్లిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, ఎమ్మిగనూర్ ప్రాంతాలతో పాటుగా కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి కూలీలను రప్పిస్తుంటారు. అయితే, భారీ వర్షాలతో క్రాసింగ్ చేసినవి కాయలుగా మారకుండా రాలిపోతాయన్న భయం రైతులను వెంటాడుతోంది.
జిల్లాలో పత్తి విత్తనోత్పత్తి సాగు ఇలా.. (ఎకరాల్లో)
ఇటీవల రైతును కలవరపెడుతున్న ఎడతెరిపి లేని వర్షాలు
మధ్యవర్తుల కొత్త నిబంధనలతోపరేషాన్
జిల్లాలో 22,783 ఎకరాల్లో సీడ్ పత్తి.. 1.05 లక్షల ఎకరాల్లో కమర్షియల్ పత్తి సాగు

సం‘పత్తి’ కలిగేనా..!?