
యూరియా కోసం రైతుల ఆందోళన
గద్వాల/గట్టు/అయిజ: విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పంటలకు సంబంధించి సరిపడా యూరియా అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నామంటూ రైతులు ఆందోళన బాట పట్టారు. మంగళవారం అయిజ మండల కేంద్రంలోని సింగిల్ విండో కార్యాలయాన్ని రైతులు దిగ్బంధించగా.. గట్టు పీఏసీఎస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పూర్తి వివరాలిలా.. మూడు రోజుల వరుస సెలవుల నేపథ్యంలో అయిజ సింగిల్‌విండో కార్యాలయానికి యూరియా సరఫరా నిలిచిపోయింది. మార్క్‌ఫెడ్ నుంచి వచ్చిన 300 బస్తాల యూరియా కోసం రైతులు ఒకేసారి గుమికూడడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈసందర్భంగా సింగిల్‌విండో అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం మార్కెట్లో యూరియా సరిపడినంతగా సరఫరా కాకపోవడం, బహిరంగ మార్కెట్‌లో ఎక్కువ ధరలకు విక్రయిస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. రైతులంతా ఒకేసారి సింగిల్‌విండో కార్యాలయానికి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నా యని అన్నారు. సరిపడా యూరియాను సరఫరా చేయాలని కలెక్టర్‌ను కోరినట్లు తెలిపారు.
ఉదయం నుంచి రాత్రి వరకు బారులు..
గట్టు పీఎసీఎస్ ఎదుట మంగళవారం యూరియా కోసం పెద్ద ఎత్తున రైతులు బారులుతీరారు. ఉదయం 6–30 గంటల నుంచే రాత్రి వరకు క్యూలైన్‌లో నిలబడ్డారు. రైతుల రద్దీని గమనించి పోలీసుల పీఏసీఎస్ దగ్గరకు చేరుకుని పరిస్థితిని అదుపు చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం వర్షాలు జోరందుకున్న తరుణంలో రైతులు తాము సాగు చేసిన పంటలకు యూరియా అవసరం కాగా, అది బయట మార్కెట్‌లో లభించకపోవడంతో లబోదిబోమంటున్నారు. రైతులు వ్యవసాయ పనులు వదిలి ఎరువులు సరఫరా చేసే పీఏసీఎస్ దగ్గర పడిగాపులు పడాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితి ఎన్నడూ చూడలేదని, పంటలను పండించుకునేందుకు యూరియా దొరకకపోవడం దారుణమని రైతులు వాపోయారు. గట్టు పీఏసీఎస్‌లో గత నెల 24న యూరియా పంపిణీని ప్రారంభించగా ఇప్పటి దాకా (ప్రస్తుతం పంపిణి చేస్తున్నవి కలుపుకొని) 3024 యూరియా బస్తాను రైతులకు అందించినట్లు పీఏసీఎస్ అధికారులు తెలిపారు.
యూరియా కొరత లేకుండా చూడాలి : మాజీ మంత్రి
జిల్లాలో యూరియా లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని యూరియా కొరత లేకుండా అవసమైన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఈమేరకు మంగళవారం ఆయన గద్వాలకు వచ్చి కలెక్టర్ బీఎం సంతోష్‌తో ప్రత్యేక భేటీ అయ్యారు. జిల్లాలో నెలకొన్న పలు సమస్యలపై చర్చించారు. ప్రధానంగా యూరియా కొరతతో పాటు, జూరాల ప్రాజెక్టు గేట్ల మరమ్మతులు, నెట్టెంపాడు ప్రాజెక్టు పరిధిలో సంగాల, తాటికుంట రిజర్వాయర్లను పూర్తిస్థాయి నీటితో నింపి ఆయకట్టుకు సాగునీటిని అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా 99,100 ప్యాకేజీల పరిధిలో అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తి చేయాలన్నారు. అనంతరం పలుసమస్యలతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్‌కు అందజేశారు. ఈకార్యక్రమంలో విష్ణువర్ధన్‌రెడ్డి, బాసుహనుమంతు, కుర్వపల్లయ్య, రాజు, మోనేష్, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
అయిజ సింగిల్‌విండో కార్యాలయం దిగ్బంధం
గట్టు పీఏసీఎస్ వద్ద రాత్రి వరకు ఎదురుచూపులు

యూరియా కోసం రైతుల ఆందోళన