
విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
ఎర్రవల్లి: వసతిగృహ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సంతోష్ ఆదేశించారు. మంగళవారం మండలంలోని ధర్మవరం బాలుర వసతి గృహం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ పరిశీలించారు. హాస్టల్ పైకప్పు పెచ్చులూడుతున్న నేపథ్యంలో విద్యార్థులకు ప్రమాదం పొంచి ఉందని, వర్షాల నేపథ్యంలో మరమ్మతులు చేపట్టాలని, అప్పటి వరకు విద్యార్థులను పాఠశాలలోనే వసతి కల్పించాలన్నారు. మరమ్మతు అంచనా నివేదికను వెంటనే సమర్పించాలని ఇంజినీరింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారిని నిశిత, పాఠశాల ప్రిన్సిపల్ లక్ష్మిరెడ్డి, వార్డెన్ జయరాములు, తదితరులు పాల్గొన్నారు.
మోటార్లతో వర్షపు నీటిని ఎత్తిపోయాలి
మానవపాడు: భారీ వర్షాల కారణంగా అండర్ రైల్వే బ్రిడ్జిలలో నీరు నిలిచిపోతుందని, ఎప్పటికప్పుడు మోటార్లతో నీరు తొలగించాలని, ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం మండలంలోని నారాయణపురం గ్రామం అండర్ రైల్వే బ్రిడ్జిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీటి మట్టం మరింత పెరిగిన సందర్భంలో, ప్రజలు సురక్షితంగా గ్రామానికి చేరుకునేందుకు డైవర్షన్ రోడ్డు ఏర్పాటు చేయాలని, ఇతర మార్గాల ద్వారా రాకపోకలకు కొనసాగేలా చూడాలన్నారు. అండర్‌పాస్‌లను రెవెన్యూ సిబ్బంది, పోలీసులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. త్వరలోనే సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. తహసీల్ధార్ జోషి శ్రీనివాస్‌శర్మ, ఎస్‌ఐ చంద్రకాంత్, సిబ్బంది పాల్గొన్నారు.
జోగుళాంబ ఆలయంలో ప్రత్యేక పూజలు
అలంపూర్: అలంపూర్ జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను కలెక్టర్ సంతోష్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. జోగుళాంబ అమ్మవారు, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాల్లో కలెక్టర్ ప్రత్యేక పూజలు చేశారు.