
ముందస్తు ఒప్పందంతో ఆందోళన
పత్తివిత్తనోత్పత్తి సాగులో ముందుస్తు ఒప్పందం మేరకు జూన్ మొదటి వారంలోనే రైతులకు విత్తనాలతో పాటుగా పెట్టుబడి కోసం మధ్యవర్తులు కొంత డబ్బులను అందజేస్తారు. అయితే, 45 రోజుల తర్వాత ఎకరాకు కేవలం తాము 150 నుంచి 200 ప్యాకెట్లు మాత్రమే కొంటామని, అంతకన్నా ఎక్కువ పండిస్తే తాము కొనలేమని చెబుతుండడంతో పత్తి రైతులు పరేషాన్ అవుతున్నారు. ముఖ్యంగా పూత రాసే (జీఎంఎస్, స్టేరల్స్) వైరెటీ సీడ్ పత్తి పంటను సాగు చేసిన రైతులు ఆందోళనలో ఉన్నారు. ఎకరాకు 4 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడి వస్తుండగా.. క్వింటన్నర, రెండు క్వింటాళ్లు మాత్రమే కొంటామని చెబుతుండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది రైతులు పత్తి మొక్కలను తొలగించుకుని వేరే పంటలను సాగు చేసుకోగా, మరికొంత మంది అలాగే కొనసాగిస్తున్నారు. రైతులకు పంటల సాగుకయ్యే పెట్టుబడి డబ్బులను మధ్యవర్తులు నిలిపి వేయడంతో రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు.