
ఎడతెరిపి లేని వానలు
గద్వాల: జిల్లాలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రాత్రనక.. పగలనకా ముసురు వర్షంతో ప్రజలు చిత్తడవుతున్నారు. ఇక వాగులు, వంకలు పొంగి పొర్లుతుండగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. శనివారం రాత్రి నుంచి సోమవారం రాత్రి వరకు జిల్లా వ్యాప్తంగా 3.8సెం.మీ. వర్షం కురిస్తే ఇందులో గరిష్టంగా రాజోలిలో 52.1 మి.మీటర్లు, ఇటిక్యాల, మల్దకల్, గట్టు, అయిజ మండలాల్లో 40 మి.మీ. పైగా వర్షపాతం నమోదైంది.
కలెక్టర్, ఎస్పీ పర్యవేక్షణ
జిల్లా వ్యాప్తంగా నాలుగురోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో కలెక్టర్ బీఎం సంతోష్, ఎస్పీ శ్రీనివాసరావు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయిలో పర్యటించి అప్రమత్తం చేస్తున్నారు. ప్రధానంగా ఎర్రవల్లి, మానవపాడు మండలా పరిధిలోని వాగులు ఉగ్రరూపం దాల్చుతుండడంతో పోలీసు, రెవెన్యూ సిబ్బందిని పహారపెట్టి రాకపోకలను నియంత్రిస్తున్నారు. మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.
రాకపోకలకు అంతరాయం
భారీ వర్షాలతో ప్రధానంగా అలంపూర్ మండలం కాశపురం వద్దనున్న వాగు పొంగి పొర్లడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అదేవిధంగా మానవపాడు మండలంలోని మానవపాడు– అమరవాయి మధ్యనున్న పెద్దవాగు ఉగ్రరూపం దాల్చడంతో ఆ రహదారిలో వెళ్లే వాహనాలకు ప్రమాదం పొంచి ఉందని, దాంతోపాటు పైభాగాన కురిసిన భారీ వర్షాలకు వర్షపు నీరు చేరి వాగు ఉధృతంగా పొంగే ప్రమాదం ఉందంటూ స్థానికులు హెచ్చరికలు చేస్తూ వాహనాల రాకపోకలను నిలిపివేశారు. మెన్నిపాడు వాగు ఉగ్రరూపం దాల్చడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. గద్వాల, ధరూరు, ఇటిక్యాల, మానవపాడు, కేటి.దొడ్డి, గట్టు, మల్దకల్, ఎర్రవల్లి, రాజోలి, అలంపూరు, వడ్డేపల్లి తదితర మండలాల పరిఽధిలో వాగులు, కుంటలు వర్షంనీటితో పొంగిపొర్లుతున్నాయి.
పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు
రాజోళిలో గరిష్టంగా 52.1 మి.మీ వర్షపాతం నమోదు
కలెక్టర్, ఎస్పీల నిరంతర పర్యవేక్షణ

ఎడతెరిపి లేని వానలు