
అనధికార మందులు విక్రయిస్తే చర్యలు
ఎర్రవల్లి: ప్రభుత్వ నిబంధనలు ఉల్లగించి అనధికార మందులు విక్రయిస్తే చర్యలు తప్పవని జిల్లా డ్రగ్ ఇన్‌స్పెక్టర్ వినయ్ అన్నారు. సోమవారం ఇటిక్యాల మండలంలోని ఉదండాపురంలో మసూద్ అహ్మద్ నిర్వహిస్తున్న ప్రథమ చికిత్స కేంద్రాన్ని నాగర్‌కర్నూల్ జిల్లా డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ విశ్వనాథ్‌రెడ్డి, మహబూబ్‌నగర్ రీజియన్ అసిస్టెంట్ డైరెక్టర్ దినేష్‌కుమార్‌తో కలిసి ఆయన తనిఖీ చేశారు. ఈమేరకు రూ.40వేల విలువైన 67 రకాల అలోపతి ఔషదాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీటిని చికిత్స చేయడం, విక్రయించడం కోసం నిల్వ చేసినందుకుగాను సెక్షన్ 18 (సి) ఉల్లంఘన కింద ప్రథమ చికిత్స కేంద్రం నిర్వాహకుడిపై కేసు నమోదు చేసి ఔషధాలను సీజ్ చేసినట్లు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆర్‌ఎంపీలు రోగులకు కేవలం ప్రథమ చికిత్సను మాత్రమే అందించాలన్నారు.