
కష్టాల కడలిలో గంగమ్మ
ఫైనాన్స్ బోర్డు తిప్పేయడంతో బతుకు కుదేలు
నా భర్త ఉన్నప్పుడు ఎప్పుడూ సంతోషంగా ఉండేవాళ్లం. ఇప్పుడు గతిలేని పరిస్థితి మాది. వానొస్తే మొత్తం కురుస్తుంది. వరద ఎప్పుడొస్తుందో తెలియదు. రేషన్ బియ్యమే మాకు దిక్కు. అదీ కొత్త బండరాయిపాకులకు వెళ్లి తెచ్చుకోవాలి. పిల్లలను పోషించలేక వనపర్తిలోని గురుకుల పాఠశాలల్లో చేర్పించా. అక్కడైనా బువ్వ దొరుకుతుందని. ఫైనాన్సోళ్ల నుంచి మా డబ్బులు మాకు ఇప్పించి న్యాయం చేయాలి.
– గంగ, మృతుడు హరిబాబు భార్య
ఈ మధ్య బ్యాంకోళ్లు వచ్చారు. రూ.2లక్షల అప్పు ఉందని.. ఇప్పుడు రూ.5 లక్షలు అయిందని చెబుతున్నారు. కోర్టు కేసు పెడతామని.. జైలుకు వెళ్లాల్సి వస్తుందని చెప్పారు. రూపాయి అప్పు పుడుత లేదు. పిల్ల తీర్చ లేదు. పిలగాడు లేకపాయె. పెడితే అందరినీ జైల్లో పెట్టండి. ఎక్కడికై నా వస్తాం. అక్కడ బువ్వ అయినా దొరుకుద్ది. నా కొడుకు పిల్లలకు కనీసం బుక్కులు, పెన్నులైనా కొనియ్యండి.
– మల్లమ్మ, హరిబాబు తల్లి
సాఫీగా సాగుతున్న జీవితంలో..
మిద్దె మల్లమ్మ, పెద్ద లక్ష్మయ్యకు నలుగురు కొడుకులు. అందరికీ పెళ్లిళ్లు కాగా.. మొదటి ముగ్గురు గతంలోనే బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వలసవెళ్లారు. చిన్నకుమారుడు హరిబాబు కాగా.. పెద్దకొత్తపల్లికి చెందిన గంగతో 14 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు ఆడపిల్లలు. ప్రస్తుతం పెద్ద కుమార్తె శ్రుతి ఇంటర్, శాన్వి ఏడు, సమీర నాలుగో తరగతి చదువుతున్నారు. హరిబాబు ఆటో, ట్రాక్టర్ నడుపుతూ వీరిని పోషించేవాడు. తల్లిదండ్రులు కూడా వీరితోనే ఉండేవారు. ఉన్నంతలో సంతోషంగా జీవనం సాగిస్తున్న క్రమంలో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్‌లో ఆ కుటుంబం పొలం, ఇల్లును కోల్పోవాల్సి వచ్చింది. వచ్చిన పరిహారంలో హరిబాబు తనకు వచ్చిన వాటాలో నెలనెలా వడ్డీ వస్తుందనే ఆశతో 2021లో ఓం శ్రీసాయిరాం ఫైనాన్స్‌లో పెట్టాడు. ఇదే వారి కుటుంబానికి శాపంగా మారింది.
మనోవేదనతో కిడ్నీలు దెబ్బతిని
భర్త హరిబాబు మృతి
ఆస్పత్రుల్లో చికిత్సకు రూ.10 లక్షలు దాటిన ఖర్చు
ముగ్గురు ఆడపిల్లలు, ముసలి అత్తామామలతో పోషణ భారం