
మహిళల ఆర్థిక ప్రగతే లక్ష్యం
గద్వాల: మహిళల ఆర్థిక ప్రగతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని.. ఈమేరకు ప్రతి మహిళను స్వయం సహాయక సంఘాలలో సభ్యులుగా చేర్చాలని అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు అధికారులను ఆదేశించారు. బుధవారం ఐడీవోసీ కార్యాలయంలోని సమావేశపు హాలులో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో నూతన స్వయం సహాయక సంఘాల ఏర్పాటు కోసం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా ఎదిగితే కుటుంబం, సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. కిశోర, బాలికలు, దివ్యాంగులు, వృద్ధులను మహిళా సంఘాల్లో చేర్చే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అర్హత కలిగిన ప్రతి మహిళను సంఘాల్లో చేర్చే బాధ్యత ఏపీఎంలు, సీసీలపై ఉందని ప్రతి అర్హురాళ్లను సభ్యురాలిగా చేర్చేలా సమన్వయంతో కృషి చేయాలని ఆదేశించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మహిళా సంఘాలు భద్రత సామాజిక గుర్తింపుతో పాటు ఆర్థిక స్థిరత్వాన్ని అందిస్తున్నాయని వివరించారు. గ్రామస్థాయిలో ఇటుకల తయారీ సెంటరింగ్ వర్క్స్ వంటి గ్రౌండ్ యూనిట్లను ఏర్పాటు చేసి కుటుంబ ఆదాయాన్ని పెంచుకునే అవకాశాన్ని కల్పిస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇళ్ల పట్టాలు మహిళల పేరిటనే మంజూరీ చేస్తున్నట్లు తెలిపారు. నిర్మాణానికి అవసరమైన నిధుల కొరత వుంటే మహిళా సంఘాల ద్వారా రుణాలు తీసుకుని ఇళ్లు పూర్తి చేసుకోవచ్చన్నారు. బ్యాంకర్లు రుణసదుపాయాల కల్పనలో పూర్తి సహకారం అందిస్తామన్నారు. కార్యక్రమంలో ఎల్డీఎం శ్రీనివాసరావు, సమాఖ్య అధ్యక్షురాలు ప్రభావతి, జిల్లా సంక్షేమ అధికారి సునంద, ఇండస్ట్రీస్ జీఎం రామలింగేశ్వర్‌గౌడ్, ఏడీఆర్‌డీవో శ్రీనివాసులు, ఏపీఎంలు, సీసీలు పాల్గొన్నారు.