
కుండపోత వర్షం..
గ్రామాల్లో ఉప్పొంగిన వాగులు, వంకలు
● అలంపూర్ మున్సిపాలిటీలో
లోతట్టు కాలనీలు జలమయం
● గంటల తరబడి నిలిచిన
వాహనాల రాకపోకలు
● స్తంభించిన జన జీవనం
● వాగులను పరిశీలించిన అధికారులు
అలంపూర్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. గత మూడు రోజులుగా ఇదే పరిస్థితి ఉండటంతో తోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అలంపూర్ నియోజకవర్గంలో సోమవారం తెల్లవారుజామున దాదాపు నాలుగు గంటలకుపైగా కుండపోత వర్షం కురిసింది. అలంపూర్ మున్సిపాలిటీలోని అక్బర్‌పేట కాలనీలో వర్షపు నీరు రోడ్డును ముంచెత్తాయి. సీసీ రోడ్డు నిర్మాణ సమయంలో డ్రైనేజీలు నిర్మించకపోవడంతో ఈ పరిస్థితులను ఎదుర్కొవాల్సి వస్తోందని కాలనీ వాసులు అందోళన వ్యక్తం చేశారు. లోతట్టు ప్రాంతాల్లోని నివాస గృహాల వద్దకు నీళ్లు చేరడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వచ్చింది. రోడ్డుపై దాదాపు 3 అడుగులకుపై నీళ్లు నిలవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.
వాగులు ఉగ్రరూపం
అలంపూర్ మున్సిపాలిటీకి అతి సమీపంలోని జోగుళాంబ వాగు ఉధృతంగా ప్రవహించింది. మండలంలోని కాశీపురం వాగు ఉగ్రరూపం దాల్చింది. కల్వర్టులు రోడ్డు కంటే తక్కువగా ఉండటంతో పై నుంచి నీళ్లు పరవళ్లు తొక్కాయి. దీంతో ఈ మార్గంలో దాదాపు ఐదు గంటలపాటు రాకపోకలు స్తంభించాయి. గ్రామస్తులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగు ద్వారానే దాటే ప్రయత్నాలు చేశారు. కోనేరు గ్రామ సమీపంలోని వాగు సైతం ప్రమాదకర స్థితితో ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. మండలంలో 71.9 మి.మీ వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు. ఉధృతంగా ప్రవహించిన వాగులను ఎస్‌ఐ వెంకటస్వామి, ఎంపీడీఓ పద్మావతి ప్రరిశీలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఉండవెల్లి మండలంలో 64.5 మి. మీ వర్షం కురిసింది. దీంతో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహించాయి. రోడ్డుపై నుంచి వరద నీరు పారడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మానవపాడు మండలంలో 11.3 మి.మీ, వడ్డేపల్లిలో 40.5 మి.మీ, రాజోలిలో 30.5 మి. మీ అయిజలో 19.3 మి.మీ వర్షపాతం నమోదు అయ్యాయి. దీంతో ఆయా మండలాల్లోని కొన్ని గ్రామాలు గంటల పాటు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

కుండపోత వర్షం..