
పొలాలకు ముప్పు..!
ఆరు వరుసల హైవేతో నీట మునుగుతున్న పంట పొలాలు
●
అయిజ: భారత్‌మాల (ఆరు వరుసల హైవే రోడ్డు) కొందరు రైతుల పాలిట శాపంగా మారింది. ఇదివరకు పంటపొలాలకు ఏర్పాటు చేసుకున్న రోడ్లు మూతపడ్డాయని అసహనం వ్యక్తం చేయగా.. తాజాగా మరో చిక్కు వచ్చి పడింది. వర్షం కురిసిన ప్రతిసారి దాదాపు 55 నుంచి 60 ఎకరాల్లో వర్షం నీరు నిలిచిపోతుంది. దీంతో పంటలు మునిగిపోవడం, తేమ ఆరకుండా మొక్కలు ఎండిపోవడం, గిడసబారి పంటకు నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ముంబై, చైన్నె కారిడార్‌లో భాగంగా మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మీదుగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన భారతమాల రోడ్డు నిర్మాణంతో పంట పొలాలకు వెళ్లేందుకు రైతులు ఏర్పాటు చేసుకున్న ఎండ్ల బండ్ల రస్తాలు (దారులు) సైతం రోడ్డు నిర్మాణంలో మూతపడుతున్నాయి. దానికి తోడు మొన్న కురుసిన వర్షాలకు భారతమాల రోడ్డు అంచుకు ఉన్న పంటపొలాల్లో నీరు నిలుస్తుంది. రోడ్డు నిర్మాణం పనులు శరవేగంగా సాగుతుండడంతో రైతుల మనసుల్లో దిగులు మొదలైంది.
ఆరు మండలాలు..
53 కి.మీ.రోడ్డు నిర్మాణం
భారతమాల రోడ్డు జిల్లాలో మొత్తం 53 కి.మీ. మేర నిర్మాణం చేపట్టారు. దీనికోసం రైతుల నుంచి ప్రభుత్వం 775 ఎకరాల భూమి స్వాధీనం చేసుకున్నారు. ఆరు మండలాల్లో నిర్మాణం పనులు శరవేగంగా నడుస్తున్నాయి. గద్వాల, అయిజ, మల్దకల్, కేటీ దొడ్డి, గట్టు, రాజోళి మండలాల మీదుగా హైవే నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. అందులో సుమారు 35 ఎకరాల ప్రభుత్వ భూమి కూడా ఉంది.
తూంకుంట శివారులో భారత్‌మాల రోడ్డు పక్కన నీట మునిగిన వ్యవసాయ పొలం
నీరు నిలుస్తుంది
భారత్‌మాల రోడ్డు నిర్మాణం చేపట్టడంతో రైతుల పంట పొలాల్లో వర్షం నీరు నిలుస్తోంది. దీంతో కొంత మంది రైతుల పంట పొలాలు మునిగిపోతున్నాయి. వర్షంనీరు ఇంకిపోయిన అనంతరం భూమిలో తేమ ఆరిపోకుండా ఉండడంతో పంటకు నష్టం చేకూరుతుంది. దిగుబడి ఘననీయంగా పడిపోతుంది. ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలి.
– దావుద్, రైతు, అయిజ
సమస్యలు పరిష్కరిస్తాం
భారత్‌మాల రోడ్డు నిర్మాణంలో భాగంగా డీపీఆర్‌లో రూపొందించిన విధంగానే పనులు చేస్తున్నారు. అయితే పంట పొలాలకు వెళ్లే రోడ్లు మూతపడ్డాయని, పంట పొలాల్లో వర్షంనీరు నిలిచిపోతుందని రైతులు వాపోతున్నారు. రైతులు వారి సమస్యలను సంబంధిత అధికారులకు తెలియజేయాలి. రైతులకు నష్టం జరుగుతుందని మా దృష్టికి వస్తే నేషనల్ హైవే అథారిటీతో మాట్లాడి సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేస్తాం.
– లక్ష్మి నారాయణ, అదనపు కలెక్టర్
వర్షం కురిసిన ప్రతి సారి ఇక్కట్లు
పంట నష్టం జరుగుతుందంటూ
రైతుల ఆందోళన

పొలాలకు ముప్పు..!

పొలాలకు ముప్పు..!

పొలాలకు ముప్పు..!