
బీసీ రిజర్వేషన్లపై కేంద్రం చర్చించాలి
గద్వాల: బీసీ రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత పార్లమెంట్ సమావేశంలో చర్చించాలని, బీసీ రిజర్వేషన్లకు తాను సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రప్రభుత్వం బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని అసెంబ్లీలో తీర్మానం చేసిన సందర్భంలో తాను కూడా సంపూర్ణ మద్దతు తెలిపినట్లు చెప్పారు. ఢిల్లీలో బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించాలని చేపట్టిన ధర్నాకు సంపూ ర్ణమద్దతు తెలుపుతున్నట్లు చెప్పారు. బీసీ రిజర్వేషన్ బిల్లుపై కేంద్రం ఆమోదించి మద్దతు పలకాలన్నారు. అదేవిధంగా ఎంతో కాలంగా నూతన రేషన్‌కార్డుల కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరీ చేయడంతో వారి ఇబ్బందులు తొలిగాయన్నారు. పేదల సొంతింటి కల సాకారం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం గద్వాల నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిందని, పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. నియోజకవర్గ పరిధిలో 7విద్యుత్తు సబ్‌స్టేషన్లకు రూ.18.70కోట్లు మంజూరీ అయ్యాయని, వీటి నిర్మాణానికి అవసరమైన 40.20ఎకరాల భూమిని కేటాయించినట్లు పనులు కూడా త్వరలోనే ప్రారంభమవుతాయన్నారు. అలాగే, విద్యుత్ గోదాం, విద్యుత్ పరికరాల స్టోర్, 10వేల మెట్రిక్ టన్నుల కెపాసిటీతో రెండు గిడ్డంగుల నిర్మాణాల కోసం రూ.20.50 కోట్లు మంజూరయ్యాయన్నారు. మల్దకల్‌లో పీఏసీఎస్ నూతన భవనం, వరికొనుగోలు కేంద్రం, బీసీ స్టడీసర్కిల్ నూతన భవనం(రూ.3కోట్లు), మహిళా సమాఖ్య భవననిర్మాణం(రూ.5కోట్లు), గ్రామీణ స్వయం ఉపాధిశిక్షణ సంస్థ భవనం(రూ.2కోట్లు), వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి కోసం 33/11కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణం కోసం రూ.4.50 కోట్లు మంజూరీ అయినట్లు తెలిపారు. గద్వాల నియోజకవర్గం అభివృద్ధికై సంపూర్ణ సహకారం అందిస్తున్న సీఎం, డీప్యూటీ సీఎం, ఉమ్మడి జిల్లా మంత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు బాబర్, మురళి, విజయ్,శ్రీకాంత్‌రెడ్డి, రఘు, తిమ్మప్ప, ప్రభాకర్‌గౌడ్, కురుమన్న తదితరులు పాల్గొన్నారు.