కులగణనతోనే ఆ వర్గాలకు న్యాయం
అయిజ: కులగణన చేస్తేనే వెనుకబడిన జాతులకు మేలు కలుగుతుందని మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్‌తో కలిసి మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్‌గాంధీ పాదయాత్ర చేశారని, ఆ సమయంలో ప్రజల ఆలోచన విధానాన్ని, సంక్షేమంలో ప్రజలు వెనుకబడిన విధానాన్ని గుర్తించారని అన్నారు. ఇప్పటి వరకు అసెంబ్లీ, పార్లమెంట్ కడప తొక్కని వెనకబడిన జాతులు చాలా ఉన్నాయని, కులగణన వెనుకబడిన కులాల, జాతుల అభ్యున్నతికి దోహదపడుతుందని, రాహుల్ గాంధీ ఇదే విషయం చెప్పారని అన్నారు. ఇప్పటి వరకు ఎవ్వరూ కుల గణన సర్వే చేయలేదని, గతంలో బీఆర్‌ఎస్ పార్టీ ఒక్కరోజు సర్వే చేసింది కానీ వివరాలు బయటపెట్టలేదని అన్నారు. రాహుల్ గాంధీ ఆలోచనను రేవంత్‌రెడ్డి అమలు చేశారని, రాష్ట్రంలో చేసిన కుల గణన దేశానికి ఆదర్శం అయ్యిందని అన్నారు. దాని ఫలితంగా కేంద్ర ప్రభుత్వం కుల గణన చేసేందుకు ముందుకొచ్చిందని అన్నారు.
తైబజార్ వేలం రద్దు
ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ మాట్లాడుతూ.. అయిజ మున్సిపాలిటీలో ఇటీవల నిర్వహించిన తైబజార్ వేలం రద్దు చేస్తున్నట్లు తెలిపారు. గతంలో తైబజార్‌ను నిర్వహించిన వారు నిబంధనలకు విరుద్ధంగా అధికంగా వసూళ్లు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయని అన్నారు. కౌన్సిలర్లు తీర్మానం చేయకుండా తైబజార్ వేలాన్ని ఎలా నిర్వహిస్తారని అన్నారు. అలంపూర్ నియోజకవర్గంలోని మూడు మున్సిపాలిటీల్లో తైబజార్‌ను నిర్వహించరాదని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అనంతరం మండలంలోని తొత్తినోనిదొడ్డిలో నూతనంగా నిర్మించిన గంగమ్మ గ్రామ దేవత ఆలయాన్ని సందర్శించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


