కాళేశ్వరం: కార్తీక మాసాన్ని పురస్కరించుకొని కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన ఆది ముక్తీశ్వర స్వామి ఆలయం వద్ద ఆకాశ, కార్తీక దీపాలను బుధవారం వెలిగించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు స్వామివారి సుగంధ ద్రవ్యాలను అందజేశారు. కార్యక్రమంలో ఆలయ సీనియర్ అసిస్టెంట్ ఉమామహేశ్వర్, అర్చకులు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
కొనసాగుతున్న
ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమ్మె
భూపాలపల్లి అర్బన్: ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు చేపట్టిన సమ్మె బుధవారం నాటికి 30వ రోజుకు చేరుకుంది. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు కలెక్టరేట్ ఎదుట దీక్షలు కొనసాగిస్తున్నారు. కార్యక్రమంలో జేఏసీ జిల్లా అధ్యక్షుడు బడితల రమేష్, ప్రధాన కార్యదర్శి మధు, వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేష్, ఉపాధ్యక్షుడు రఘురాం, అడ్వైజర్స్ శ్రీనివాస్, ప్రభాకర్, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ప్రవీణ్, జగదీశ్, మీడియా ఇన్‌చార్జ్ రాజు, రామ్మూర్తి, విజయ్ పాల్గొన్నారు.
పోలీసు సేవకు జాతీయ పురస్కారం
● అతిఉత్కృష్ట సేవా పతకానికి ఎంపికై న తెలంగాణ ఇంటెలిజెన్స్ ఎస్పీ రమేష్
వెంకటాపురం(ఎం): తెలంగాణ పోలీసు శాఖలో ఇంటెలిజెన్స్ ఎస్పీగా పనిచేస్తున్న ములుగు జిల్లా వెంకటాపురం(ఎం) మండల కేంద్రానికి చెందిన డి.రమేష్‌కు ప్రతిష్టాత్మక అతిఉత్కృష్ట సేవా పతకం –2026ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 25 ఏళ్లకు పైగా పోలీసు శాఖలో అంకితభావంతో సేవలందిస్తున్న ఆయనకు జాతీయ స్థాయిలో ఈ గుర్తింపు లభించడం విశేషం. వామపక్ష తీవ్రవాద నిర్మూలనలో భాగంగా చేపట్టిన ఆపరేషన్ కగార్‌లో రమేష్ కీలకపాత్ర పోషించారు. మావోయిస్టు కార్యకలాపాల నియంత్రణ, అటవీ ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి వచ్చేలా చర్యలు, లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం కల్పించడంలో విశేష కృషిచేశారు. వెనుకబడిన ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం చేయడంలోనూ రమేష్ కీలకంగా వ్యవహరించారు. 2010లో ముఖ్యమంత్రి శౌర్య పతకం, 2018లో తెలంగాణ పోలీసు సేవా పతకం, 2024లో ఇండియన్ పోలీస్ మెడల్‌ను ఆయన అందుకున్నారు. తాజాగా మరో ప్రతిష్టాత్మక జాతీయ పురస్కారం రమేష్‌ను వరించింది.


