భూపాలపల్లి అర్బన్: జిల్లాలో భూముల రీ–సర్వే ప్రక్రియను వేగవంతం చేసి లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ రెవెన్యూ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖల అధికారులను ఆదేశించారు. రాష్ట్ర రెవెన్యూ, గృహా నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో మొత్తం 83 గ్రామాల్లో రీ–సర్వే చేపట్టాల్సి ఉండగా, ఇప్పటివరకు 30 గ్రామాల్లో మాత్రమే ప్రారంభమైందన్నారు. మిగిలిన గ్రామాల్లోనూ నవంబర్ 16వ తేదీ నాటికి సర్వే ప్రారంభించేలా తహసీల్దార్లు కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. సర్వే కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, ఒక గ్రామంలో ప్రక్రియ పూర్తయిన తర్వాతే మరో గ్రామానికి పంపాలని సూచించారు. రోజూ ఉదయం 9 గంటలకే సర్వే పనులు ప్రారంభించాలని, అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి పురోగతిని పర్యవేక్షించాలని తెలిపారు. డిసెంబర్ మొదటి వారం నాటికి సర్వేలో గణనీయమైన పురోగతి సాధించాలని స్పష్టం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రీ–సర్వేలో పాల్గొనడానికి నిరాకరించే లైసెన్స్‌డ్ సర్వేయర్లపైనా చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతకుముందు వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో రీ–సర్వే ప్రక్రియను వేగవంతం చేయడంతోపాటు భూ సమస్యలు, పెండింగ్ దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు. భూయజమానులకు రెండు విడతల్లో నోటీసులు జారీ చేసి, క్షేత్రస్థాయిలో కౌన్సెలింగ్ నిర్వహించాలని సూచించారు. హక్కుల రికార్డులను పరిశీలించి భూ వివాదాలను త్వరగా పరిష్కరించాలని, అర్హులకు పాస్‌పుస్తకాలు జారీ చేయాలని తెలిపారు. సర్వేలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, పెండింగ్ దరఖాస్తుల పరిష్కారాన్ని కూడా వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ కుసుమ కుమారి, ఆర్డీఓ హరికృష్ణ, తహసీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్ శర్మ
నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై చర్యలు


