కాళేశ్వరాలయం పునర్నిర్మాణ, అభివృద్ధి పనుల్లో జాప్యం
పుష్కరాల నాటికి పూర్తయ్యేనా?
వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7 వరకు జరిగే గోదావరి పుష్కరాలకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు కాళేశ్వరం వచ్చే అవకాశం ఉంది. త్రివేణి సంగమంలోని గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించడంతో పాటు శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో దేవస్థానం, ఘాట్ల అభివృద్ధి, రహదారులు, పారిశుద్ధ్యం, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాల పనులను సకాలంలో పూర్తి చేయాల్సిన అవసరం ఉంది.
కాళేశ్వరం: రాష్ట్రంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన కాళేశ్వరం దేవస్థానం పునర్నిర్మాణ, అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. పనులను పరిశీలించి వేగం పెంచాలని గత నెల 29న దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు స్పష్టమైన ఆదేశాలు జారీచేసినప్పటికీ క్షేత్రస్థాయిలో పనుల పురోగతి ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. అవసరమైతే డే అండ్ నైట్ పనులు చేయాలని చెప్పినప్పటికీ పట్టించుకోవడం లేదు.
నత్తనడకన సాగుతున్న పనులు..
రూ.198కోట్ల వ్యయంతో కాళేశ్వరాలయం పునర్నిర్మాణ, అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. రూ.60కోట్ల వ్యయంతో అష్ట తీర్ధాల ఘాట్ల పనులు చేపట్టారు. విజయగణపపతి ఆలయం పునాదిపైన ఉపపీఠం, అధిస్ఠానం, స్తంభవర్గం పనులు పూర్తయి స్లాబ్ పనులు చేయాల్సి ఉంది. శ్రీశుభానందదేవి(పార్వతి) శ్రీసరస్వతి, శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఆలయాల్లో ఉపపీఠం పూర్తయి అధిస్ఠానం పనులు జరుగుతున్నాయి. రామాలయం పునాదిపై గ్రేడ్‌స్లాబ్ వర్క్స్ జరుగుతున్నాయి. ప్రధాన గర్భగుడి ఉపపీఠం పనులు జరుగుతున్నాయి. ముందు ముఖ మండపం పనుల్లో ఆశించినంత పురోగతి లేదు. పడమర వైపు గోపురం సివిల్ వర్క్స్ జరుగుతుండగా.. ఉత్తరం వైపు గోపురం స్టోన్ వర్క్స్ జరుగుతుండగా, దక్షిణంపై సివిల్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పడమర, ఉత్తరం, దక్షిణం వైపున ప్రాకారాల పనుల్లో వేగం లేదు. రాత్రి, పగలు పనిచేస్తూ కూలీలు, మిషనరీ ఎక్కువ సంఖ్యలో పెడితే పనుల్లో వేగం పెరిగే అవకాశం ఉంది. ఇంకా అష్టతీర్ధాల ఘాట్ల నిర్మాణానికి భూసేకరణ అడ్డంకిగా మారడంతో పనులు సాగడం లేదు.
ఆశించిన స్థాయిలో
ముందుకుసాగని పనులు
పుష్కరాల వరకై నా పూర్తయ్యేనా..
ఉన్నతాధికారులు
ప్రత్యేక దృష్టి సారించాల్సిందే..
పర్యవేక్షణ లేకపోవడమే కారణమా..
పనుల్లో జాప్యానికి గల కారణాలను ఉన్నతాధికారులు సమీక్షించి, క్షేత్రస్థాయిలో ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. కలెక్టర్ స్థాయిలో ప్రతీ రోజు పనులపై సమీక్షించాలని, ఉన్నతాధికారులు నెలకోసారి పర్యవేక్షిస్తామని ఉన్నతాధికారులు పేర్కొన్నా.. పనులు అంతగా సాగడం లేదని ఆరోపణలు ఉన్నాయి. పనుల వారీగా గడువులు నిర్ణయించి, ప్రతీ రోజు పురోగతిని సమీక్షించడంతో పాటు అవసరమైన నిధులు, సిబ్బంది, యంత్రాలను మరింతగా అందుబాటులో ఉంచాలని సూచిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని పనుల్లో వేగం పెంచకపోతే పుష్కరాల నాటికి అన్ని పనులు పూర్తి చేయడం కష్టసాధ్యమవుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. పుష్కరాల నిర్వహణకు ముందే కాళేశ్వరం దేవస్థానంలో కుంభాభిషేకం నిర్వహించాల్సి ఉంది.


