భూపాలపల్లి అర్బన్: తమ సమస్యల పరిష్కారం, ఉద్యోగాల క్రమబద్ధీకరణ, ఉద్యోగ భద్రత కల్పించాలనే ప్రధాన డిమాండ్లతో జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగులు చేపడుతున్న నిరవధిక సమ్మెకు మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు సంఘీభావం తెలిపారు. కలెక్టరేట్ ఎదుట ఉద్యోగులు చేపడుతున్న దీక్షా శిబిరాన్ని శుక్రవారం సందర్శించి వారి ఆందోళనకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా పుట్ట మధు మాట్లాడుతూ.. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం 25 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమన్నారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చి సమ్మె విరమణకు ప్రభుత్వం చొరవ చూపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు పాల్గొన్నారు.
చిట్యాల సర్కిల్
కార్యాలయం తనిఖీ
చిట్యాల/మొగుళ్లపల్లి: చిట్యాల మండలకేంద్రంలోని సీఐ సర్కిల్ కార్యాలయం, మొగుళ్లపల్లి పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం రికార్డులు, పెండింగ్ కేసుల పనితీరును ఆయన పరిశీలించారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు అప్రమత్తంగా వ్యవరిస్తూ నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని కోరారు. పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, కేసులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతీ ఒక్కరు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ వై.సతీష్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
కోతలు లేకుండా
ధాన్యం కొనుగోలు
గణపురం: కొనుగోలు కేంద్రాల్లో కోతలు లేకుండా మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. గణపురం మండలం గొల్లపల్లి గ్రామంలో ిపీఏసీఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ లోడింగ్, అన్‌లోడింగ్ ప్రక్రియలను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ రైతులకు న్యాయం చేయాలని ఆదేశించారు. రైతుల సంక్షేమం కోసం ప్రజాప్రభుత్వం నిరంతరం శ్రమిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.


