ఆ ఊరికే ప్రత్యేకం.. పెద్ద బతుకమ్మ
జఫర్గఢ్: సద్దుల బతుకమ్మకు మండలంలోని ఉప్పుగల్లు గ్రామానికి చెందిన పోరెడ్డి సత్యనారాయణరెడ్డి కుటుంబం పెద్ద బతుకమ్మతో (5 ఫీట్లు) ప్రత్యేకతను చాటుకుంటోంది. ఏళ్లుగా తన తండ్రి నర్సింహారెడ్డి నుంచి వస్తున్న ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. సద్దుల పండుగకు వివిధ రకాల పూలను సేకరించి కుటుంబ సభ్యులంతా కలిసి అందంగా బతుకమ్మను పేరుస్తారు. సాయంత్రం సమయంలో ఇంటిల్లిపాది పెద్ద బతకమ్మను తీసుకుని డప్పుచప్పుళ్లు, డీజేతో ఊరేగింపుగా బతుకమ్మ ఆటస్థలానికి వెళ్తారు. గ్రామ మహిళలతో కలిసి సంప్రదాయ పాటలు పాడుతూ బతుకమ్మ ఆడుతారు. కొన్ని రకాల పూలు దొరక్కపోయినా కొని మరీ పేరుస్తూ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.
ఏటూరునాగారం: తాతముత్తాల నుంచి ఆనవాయితీగా ఎత్తయిన బతుకమ్మను పేరుస్తూ మండలంలోనే ప్రత్యేకంగా నిలుస్తున్నారు ఏటూరునాగారం మండల కేంద్రంలోని నూతి కృష్ణ జ్యోతి. 70 ఏళ్లుగా ఐదు ఫీట్ల ఎత్తులో తీరొక్క పూలతో బతుకమ్మలను పేరుస్తున్నారు. వారం రోజుల నుంచే పూలు సేకరిస్తున్నారు. స్థానికంగా దొరకని పూలను వరంగల్ నుంచి తెప్పించి మరీ పెద్ద బతుకమ్మను పేరుస్తున్నారు. కాగా, సద్దుల బతుకమ్మ రోజు తమ ఇంట్లోని ముగ్గురు మహిళలు ఉదయం 8 గంటల నుంచి పేర్చడం ప్రారంభిస్తే సాయంత్రం వరకు సమయం పడుతుందని, ఈ సమయంలో అమ్మవారిని కీర్తిస్తూ పాటలు పాడుతామని వారు చెబుతున్నారు. ఇన్నేళ్ల నుంచి గ్రామంలో ఇదే పెద్దదిగా పేరుగాంచింది.


