భూపాలపల్లి: ఎల్నినో ప్రభావంపై అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. ఎల్నినో ప్రభావంతో సంభవించే వాతావరణ మార్పులు, వర్షాభావ పరిస్థితులు, వ్యవసాయ కార్యకలాపాలు, విద్యుత్ సరఫరా, తాగునీటి లభ్యత, సాగునీటి వనరులు, పశుసంపద, ప్రజారోగ్యం, గ్రామీణ జీవనోపాధిపై పడే సంభావ్య ప్రభావాలను దృష్టిలో ఉంచుకుని అన్ని మండలాల్లో ప్రస్తుత పరిస్థితులు, సంసిద్ధత చర్యలను క్షేత్రస్థాయిలో సమగ్రంగా అంచనా వేసేందుకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ కలెక్టర్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. అధికారులు తమకు కేటాయించిన మండలాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి వర్షపాతం, వాతావరణ పరిస్థితులు, వ్యవసాయం, విద్యుత్ సరఫరా, తాగునీరు, సాగునీటి వనరులు, భూగర్భ జలాలు, పశుసంవర్ధక, ప్రజారోగ్య పరిస్థితులను సమగ్రంగా పరిశీలించాలని ఆదేశించారు. ప్రత్యేక అధికారులు తమకు కేటాయించిన మండలాల్లో మండల స్థాయి అధికారులతో సమన్వయం చేసుకుంటూ రోజువారీ క్షేత్రస్థాయి తనిఖీ నివేదికలను సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపారు.
ముందస్తు ప్రణాళికతో ఉండాలి..
ఎల్నినో ప్రభావంతో రానున్న రోజుల్లో ఏర్పడే సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం ముందస్తు ప్రణాళికతో అప్రమత్తంగా ఉండాలని సీడీఎంఏ డాక్టర్ టి.కె. శ్రీదేవి ఆదేశించారు. శనివారం ఉమ్మడి వరంగల్ జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆమె సమీక్షించారు. ఈ సమావేశానికి ఐడీఓసీ కార్యాలయం నుంచి కలెక్టర్ రాహుల్ శర్మ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు..
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు, విశిష్ట జీవన విధానానికి ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ కలెక్టర్ రాహుల్ శర్మ శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతిని, పూలను పూజించే గొప్ప పండుగ బతుకమ్మ అని పేర్కొన్నారు. ఆడపడుచులు అందరూ కలిసి ఆనందోత్సాహాల మధ్య బతుకమ్మ ఆడుకోవాలని, ఈ పండుగ ప్రతి ఇంటా సంతోషాన్ని, ఆయురా రోగ్యాలను, సమృద్ధిని నింపాలని ఆకాంక్షించారు.
మండలాలకు ప్రత్యేక అధికారుల నియామకం
కలెక్టర్ రాహుల్ శర్మ


