● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు
● కలెక్టర్తో కలిసి పనుల పరిశీలన
భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి పట్టణంలో పెరుగుతున్న జనాభా, వాహనాల రద్దీకి అనుగుణంగా రోడ్ల విస్తరణ పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. పట్టణంలోని అంబేడ్కర్ కూడలి అభివృద్ధి నమూనా ప్రణాళికను కలెక్టర్ రాహుల్శర్మతో కలిసి శనివారం పరిశీలించారు. అనంతరం ప్రజాప్రతినిధులు, అధికారులతో క్షేత్రస్థాయిలో సమీక్షించారు. అనంతరం మాట్లాడుతూ ప్రజల భద్రత, సౌకర్యవంతమైన ప్రయాణం కోసం రోడ్ల విస్తరణ అత్యవసరమన్నారు. నాణ్యతా ప్రమాణాలతో పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. భూసేకరణ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. రోడ్ల విస్తరణతో ప్రభావితమయ్యే చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయంగా రోడ్డు సరిహద్దుల్లో తగిన స్థలం, వ్యాపార అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. ఇందుకు అవసరమైన నిర్మాణ పనులను రాబోయే పది రోజుల్లో ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
అధికారులు సమన్వయంతో పనిచేయాలి
రోడ్ల విస్తరణ పనులకు అడ్డంకిగా ఉన్న సింగరేణి, విద్యుత్ శాఖ, జెన్కో విద్యుత్ లైన్లు, ఆర్డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ, సింగరేణి పైపులైన్ల మార్పునకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్, సింగరేణి, విద్యుత్, పంచాయతీరాజ్, మిషన్ భగీరథ, మున్సిపల్ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.


