కాళేశ్వరం: మహదేవపూర్ మండలం అన్నారం టు కాళేశ్వరానికి ప్రత్యామ్నాయంగా మరో విద్యుత్ లైన్ ఏర్పాటు చేయాలని ‘పుణ్యక్షేత్రానికి ఇక వెలుగులే’ అనే శీర్ష్షికన సాక్షిలో శనివారం ప్రచురితమైన కథనానికి అధికారులు, సంబంధితశాఖలు అప్రమత్తమయ్యాయి. ఈ కథనంపై ఎన్పీడీసీఎల్, ఇరిగేషన్, అటవీశాఖలతో పాటు దేవాదాయశాఖల్లో పరిస్థితికి అద్దంపట్టేలా కథనం ఉందని తీవ్ర చర్చ సాగినట్లు తెలుస్తోంది. శనివారం అన్నారం టు కాళేశ్వరం వరకు మరో విద్యుత్ లైన్ కోసం ఎన్పీడీసీఎల్, ఇరిగేషన్‌శాఖ అధికారులు సంయుక్తంగా సర్వే చేపట్టారు. 12కిలోమీటర్ల దూరంలో తమ ఆధీనంలోని గ్రావిటీ కాల్వపై ఉన్న పెద్ద విద్యుత్ టవర్ల వద్ద ఏర్పాటుకు పరిశీలన చేశారు. ఎన్పీడీసీఎల్ అధికారులు తమ కోఆర్డినేట్స్ కోసం సర్వే చేపడుతారని తెలిసింది. రెండు రోజుల్లో నివేదికలు ఉన్నతాధికారులకు అందనున్నట్లు ఎన్పీడీసీఎల్ అధికారులు పేర్కొన్నారు. ఈ సర్వేలో ఇరిగేషన్ డీఈఈ సత్యం బాబు, ఎన్పీడీసీఎల్ ఏడీఈ రమేష్, ఏఈఈ శ్రీకాంత్, ఏఈ ప్రణయ్ ఉన్నారు.


