భూపాలపల్లి అర్బన్: వినాయక చవితిని పర్యావరణహితంగా నిర్వహించేందుకు ప్రతీ ఒక్కరు మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి పూజించాలని కలెక్టర్ రాహుల్‌శర్మ పిలుపునిచ్చారు. కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఆవరణలో ‘మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం’ వాల్‌పోస్టర్లు ఆవిష్కరించి మట్టి గణపతుల ఉచిత పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పీఓపీ విగ్రహాలు, రసాయనిక రంగుల వల్ల నిమజ్జనం సమయంలో నీటి వనరులు కలుషితమయ్యే అవకాశం ఉందన్నారు. ప్రకృతి సిద్ధమైన మట్టి విగ్రహాలను పూజించడం ద్వారా పర్యావరణాన్ని, నీటి వనరులను కాపాడవచ్చని తెలిపారు. జిల్లావ్యాప్తంగా రెండు వేల మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, డీఆర్వో వసంతకుమారి, ఆర్డీఓ హరికృష్ణ, కాలుష్య నియంత్రణ మండలి ఏఈ శ్రీకాంత్, జిల్లా సైన్స్ అధికారి స్వామి పాల్గొన్నారు.
మార్చికి పనులు పూర్తి చేయాలి..
రానున్న ఏడాది మార్చి నాటికి గోదావరి పుష్కరాలకు సంబంధించిన అభివృద్ధి పనులు, మౌలిక వసతుల ఏర్పాట్లు పూర్తిచేయాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ ఆదేశించారు. హైదరాబాద్‌లోని తన కార్యాలయం నుంచి గోదావరి పరివాహక జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పుష్కర ఘాట్లు, ఆలయాల అభివృద్ధి, రోడ్ల విస్తరణ, భూసేకరణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. ఈ సందర్బంగా కలెక్టర్ రాహుల్‌శర్మ మాట్లాడుతూ..సరస్వతీ ఘాట్ నుంచి మెయిన్ ఘాట్ వరకు 18 ఎకరాల భూమి అవసరమని, భూసేకరణకు సుమారు రూ.5 కోట్లు వ్యయం అయ్యే అవకాశం ఉందన్నారు. త్వరలో భూసేకరణ నోటిఫికేషన్ జారీచేస్తామని తెలిపారు.
ఓటర్ల జాబితాపై ప్రత్యేక దృష్టి
ఎన్నికల విధులు, ఓటర్ల జాబితా నిర్వహణలో అధికారులు జవాబుదారీతనంతో పనిచేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టర్లు, ఎన్నికల అధికారులు, ఆర్డీఓలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఓటర్ల మ్యాపింగ్, అనామలీస్ ఓటర్లకు నోటీసుల జారీపై సమీక్షించారు. నిర్లక్ష్యాన్ని సహించేది లేదని స్పష్టంచేశారు. జిల్లాలో ఇప్పటివరకు 32,636 నోటీసులు జనరేట్ కాగా, 21,894 నోటీసులు పంపిణీ చేయాల్సి ఉందని కలెక్టర్ రాహుల్‌శర్మ తెలిపారు. వీటిని మూడు రోజుల్లో పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
కలెక్టర్‌ను కలిసిన సబ్ కలెక్టర్
కాటారం సబ్ కలెక్టర్‌గా నియమితులైన సౌరబ్ శర్మ కలెక్టరేట్‌లో కలెక్టర్ రాహుల్‌శర్మను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు మొక్కను అందజేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా కలెక్టర్‌ను కలిసిన సబ్ కలెక్టర్ కాటారం డివిజన్‌లో పాలన, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యల పరిష్కారంపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ శర్మ నూతన సబ్ కలెక్టర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.
కలెక్టర్ రాహుల్‌శర్మ


