భూపాలపల్లి అర్బన్: గనుల్లో భద్రతా ప్రమాణాలను పటిష్టంగా అమలు చేయడంతోపాటు ఉద్యోగులు, కార్మికుల ఆరోగ్యం, భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని కార్పొరేట్ సేఫ్టీ జీఎం సాయిబాబు సూచించారు. ఏరియాలోని జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌హాల్‌లో సోమవారం ఆక్యుపేషనల్ కోడ్–2020, ఆక్యుపేషనల్ సేప్టీ హెల్త్, వర్కింగ్ కండిషన్స్ సెంట్రల్ రూల్స్–2026పై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిబాబు మాట్లాడుతూ.. ప్రతీ ఉద్యోగి, కార్మికుడి ప్రాణ భద్రత సంస్థకు అత్యంత ముఖ్యమన్నారు. ప్రతీ పని ప్రారంభానికి ముందే ప్రమాదాలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. నిబంధనలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలుచేయాలని, భద్రతా ప్రమాణాలపై నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని తెలిపారు. భూగర్భ గనుల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికులు వ్యక్తిగత రక్షణ పరికరాలను తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు. ‘సేఫ్టీ ఫస్ట్’ భావనతో ప్రతీ ఒక్కరు విధులు నిర్వహించాలని, భద్రత అనేది కేవలం సేఫ్టీ విభాగానికే కాకుండా ప్రతీ ఒక్కరి సమష్టి బాధ్యత అని స్పష్టంచేశారు. అంతకు ముందు మొదటి షిఫ్ట్‌లో ఏరియా జీఎం ఏనుగు రాజేశ్వర్‌రెడ్డితో కలిసి సేఫ్టీ జీఎం సాయిబాబు, సేఫ్టీ ఆర్జీ రీజియన్ జీఎం కె.మల్లయ్య ఏరియాలోని కేటీకే 6వ భూగర్భ గనిని సందర్శించి అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఏరియా అధికారులు శ్యామ్‌సుందర్, జ్యోతి, మాటూరి రవీందర్, సాంబశివరావు, రామస్వామి, అన్ని గనుల ఏజెంట్లు, మేనేజర్లు, సేఫ్టీ ఆఫీసర్లు, ప్రాజెక్టు ఇంజనీర్లు, ఫిట్ ఇంజనీర్లు, గ్రూప్ ఇంజనీర్లు పాల్గొన్నారు.
కార్పొరేట్ సేఫ్టీ జీఎం సాయిబాబు


