భూపాలపల్లి: ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి పతనం తప్పదని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారెంటీలను అమలుచేయాలని కోరుతూ కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజావాణిలో ప్రజలతో కలిసి కలెక్టర్ రాహుల్‌శర్మకు దరఖాస్తు సమర్పించారు. అనంతరం బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకున్నందుకు, పోలీసులు దాడులకు పాల్పడినందుకు నిరసనగా కలెక్టరేట్ ఎదురుగా జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. 420 హామీలు, ఆరు గ్యారెంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఏ ఒక్క హామీని అమలు చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తుందన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ రాక విద్యార్థులు, ఉద్యోగ నియామకాలు లేక నిరుద్యోగులు, సకాలంలో రైతు భరోసా అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కటకం జనార్దన్, నాయకులు మేకల సంపత్‌కుమార్, గండ్ర హరీశ్‌రెడ్డి, మందల విద్యాసాగర్‌రెడ్డి, రాజిరెడ్డి, లత పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి


