● కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్
భూపాలపల్లి రూరల్: అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు క్షమాపణ చెప్పడంతో పాటు పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్ డిమాండ్ చేశారు. సోమవారం కాంగ్రెస్ శ్రేణులు జిల్లాకేంద్రంలో ధర్నా నిర్వహించాయి. ఈ సందర్భంగా కరుణాకర్ మాట్లాడుతూ మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న స్పీకర్‌పై బాధ్యతారహితంగా, అనుచితంగా వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య విలువలను అవమానించడమేనన్నారు. స్పీకర్ పదవి పార్టీలకు అతీతమైన రాజ్యాంగబద్ధమైన అత్యున్నత బాధ్యత అని, అలాంటి పదవిలో ఉన్న వ్యక్తిపై వ్యక్తిగతంగా, అవమానకరంగా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు దాట్ల శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, పట్టణ మాజీ అధ్యక్షుడు దేవన్, మహిళా అధ్యక్షురాలు మాలతి, కోమల, గుగ్గిళ్ల లక్ష్మి, కౌన్సిలర్లు, పార్టీ జిల్లా, పట్టణ, మండల నాయకులు పాల్గొన్నారు.


