న్యూస్‌రీల్
భూపాలపల్లిలో జోరుగా
సాగుతున్న వ్యాపారం
భూపాలపల్లి: సింగరేణి పారిశ్రామిక ప్రాంతమైన భూపాలపల్లి పట్టణంలో వడ్డీ దందా జోరుగా సాగుతోంది. కొందరు స్థానిక, స్థానికేతర వ్యాపారులు అత్యంత విలువైన పత్రాలు, బంగారు నగలు తనాఖా పెట్టుకొని నెలకు నూటికి రూ.10 వరకు వడ్డీ తీసుకుంటున్నారు. ఈ దందాలో నష్టాలు లేకపోవడం.. ఏడాదిలోనే అసలు డబ్బు రెట్టింపు అవుతుండటంతో వ్యాపారంలోకి దిగే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.
రూ.10వరకు వడ్డీ వసూలు..
వడ్డీ వ్యాపారం కొనసాగిస్తున్న వ్యాపారులు ప్రభుత్వ నిబంధనలను బేఖాతర్ చేస్తూ అధికంగా వడ్డీ వసూలు చేస్తున్నారు. అప్పు తీసుకునే వ్యక్తి అవసరాన్ని ఆధారంగా చేసుకొని నూటికి రూ.6 నుంచి రూ.10 వరకు వడ్డీ వసూలు చేస్తున్నారు. అప్పు ఇచ్చిన వ్యాపారే ప్రతీ నెల బ్యాంకుకు వెళ్లి తనాఖా ఉంచుకున్న ఏటీఎం కార్డు లేదా చెక్‌బుక్‌ల సహాయంతో డబ్బులను విడిపించుకుంటున్నాడు. తనకు రావాల్సిన వడ్డీ, అసలులో కొంతభాగాన్ని సొంతం చేసుకొని మిగిలిన డబ్బులను అప్పు తీసుకున్న వ్యక్తి ఇంటికి వెళ్లి తిరిగి ఇస్తున్నారు. ఈ తంతంగం అంతా వేతనాలు పొందే నెల మొదటి వారంలో పూర్తి చేస్తున్నారు.
గిరిగిరితో కిరికిరి..
కొంతమంది వడ్డీ వ్యాపారులు చిరు వ్యాపారులను టార్గెట్ చేసి తమ దందాను సాగిస్తున్నారు. చిన్నచిన్న హోటళ్లు, పాన్‌షాపులు, పండ్లు తదితర వ్యాపారుల అవసరాన్ని ఆసరాగా తీసుకొని గిరిగిరి పేరిట అప్పు ఇస్తున్నారు. అప్పు తీసుకునే వ్యక్తి రూ.లక్ష తీసుకుంటే, ప్రామిసరీ నోటు రాయించుకొని రూ.90 వేలు మాత్రమే ఇస్తున్నారు. రూ.10వేలను ముందుగానే వడ్డీ కింద తీసుకుంటున్నారు. రూ.90 వేలను రోజుకు రూ.వేయి చొప్పున 90 రోజులు వసూలు చేస్తున్నారు. ఈ దందాలో భారీగా లాభాలు ఉండటంతో పలువురు దుకాణదారులు సైతం రంగంలోకి దిగారు. జిల్లాకేంద్రంలో జోరుగా సాగుతున్న ఈ వడ్డీ దందాపై ఇప్పటికై నా పోలీసులు ఉక్కుపాదం మోపాలని పట్టణ ప్రజలు, చిరు వ్యాపారులు కోరుతున్నారు.
అనుమతులు లేకుండానే..
జిల్లా కేంద్రంలో గతంలో అనుమతులు పొందిన ఫైనాన్స్ కార్యాలయాలు ఉండగా కొన్నేళ్ల క్రితం వాటిని మూసివేశారు. దీంతో పట్టణానికి చెందిన, ఇతర ప్రాంతాలకు చెందిన సుమారు వందమందికి పైగా వ్యాపారులు ప్రభుత్వం నుంచి అనుమతులు, కార్యాలయాలు లేకుండానే ఇంటి వద్ద నుంచే తమ దందాను కొనసాగిస్తున్నారు. ఒక్కో వ్యాపారి సుమారుగా రూ.10 లక్షల నుంచి రూ. కోటి వరకు వ్యాపారం సాగిస్తున్నట్లు సమాచారం. వ్యాపారం దెబ్బతినకుండా ఉండేందుకు అప్పు ఇచ్చే ముందు పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ అప్పు తీసుకునే వ్యక్తి నుంచి బ్యాంకు ఖాతాబుక్, చెక్‌బుక్, ఏటీఎం కార్డు, బంగారు నగలు, భూమి రిజిస్ట్రేషన్ పత్రాలను తీసుకుంటున్నారు. వీటికి తోడు ప్రామిసరీ నోటుపై వివరాలు ఏమీ రాయకుండానే సంతకం చేయించుకుంటున్నారు. అలా అయితేనే డబ్బులు ఇస్తామని చెబుతుండటంతో బాధితులు చేసేదేమీ లేక వ్యాపారులు అడిగిన వాటినన్నింటినీ అప్పగిస్తున్నారు. అప్పటి నుంచి బాధితుడికి బాధలు మొదలవుతున్నాయి.
నూటికి రూ.6 నుంచి
రూ.10 వరకు మిత్తి
లైసెన్సులు లేకుండానే
విచ్చలవిడిగా దందా
విలువైన పత్రాలు,
బంగారు ఆభరణాలు తనఖా
అడపదడపా పోలీసుల తనిఖీలు
దాడులు చేస్తాం..
నిబంధనలు ఉల్లంఘిస్తూ వడ్డీ వ్యాపారం చేస్తున్న వారిపై దాడులు నిర్వహిస్తాం. గతంలో పలువురిపై కేసులు కూడా నమోదు చేశాం. అధిక వడ్డీ వసూలు చేస్తున్న వారి సమాచారం అందిస్తే వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం.
– ఎ.సంపత్‌రావు, డీఎస్పీ, భూపాలపల్లి


