గణపురం: గర్భిణులు, బాలింతలకు ప్రతీ రోజు సమతుల్యమైన పౌష్టికాహారం అందించాలని జిల్లా వైద్యాధికారి ముధుసూదన్ అన్నారు. గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లె గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో శనివారం నిర్వహించిన పౌషకాహార వారోత్సవాల్లో ఆయన పాల్గొని అవగాహన కల్పించారు. అనంతరం మాట్లాడుతూ గర్భదారణ సమయంలో పౌషకాహారం తీసుకోవడం వలన తల్లి ఆరోగ్యంతో పాటు శిశువు ఎదుగుదల కూడా మెరుగ్గా ఉంటుందన్నారు. పిల్లల ఎదుగుదల, ఆరోగ్యానికి పౌష్టికాహారం ఎంతో అవసరమన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందించే పోషకాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.
రేపు పరీక్షలు
భూపాలపల్లి అర్బన్: ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు అవసరమైన ఉచిత ఉపకరణాలను అందించేందుకు ఈ నెల 7న నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా ఇన్‌చార్జ్ విద్యాశాఖ అధికారి ఎల్.లలిత, కమ్యూనిటీ మొబలైజింగ్ ఆఫీసర్ సామల రమేశ్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల ఆవరణలో భారత కృతిమ అవయవాల నిర్మాణ సంస్థ (అలిమ్కో), సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే 150మంది ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులను గుర్తించినట్లు తెలిపారు. ఉపకరణాలు అవసరమైన విద్యార్థులు రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు, 40శాతానికి పైగా వైకల్యం ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన సదరం సర్టిఫికెట్ లేదా ప్రభుత్వ వైద్యుడు జారీచేసిన వైకల్య ధ్రువపత్రం, ఆధార్ కార్డు, ఆదాయ ధ్రువపత్రం లేదా రేషన్ కార్డుతో శిబిరానికి హాజరుకావాలని సూచించారు. విద్యార్థితో పాటు తల్లిదండ్రుల్లో ఒకరికి బస్‌చార్జీలు, భోజన సౌకర్యం కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు.
నిర్మాణ పనుల పరిశీలన
కాళేశ్వరం: కాళేశ్వరం దేవస్థానం ఆలయ నిర్మాణ పనులను ఈఓ మహేశ్, క్షేత్ర కన్సల్టెన్సీ ఇంజనీర్లు, ఆర్కిటెక్చర్‌లు, పాలవవర్గం డైరెక్టర్ మంచినీళ్లు దుర్గయ్య, దొడ్ల అశోక్ శనివారం పరిశీలించారు.
జిల్లా అధ్యక్షుడిగా తిరుపతి
భూపాలపల్లి రూరల్: ఈ–పంచాయతీ జిల్లా అధ్యక్షుడిగా గుండెబోయిన తిరుపతి ఎన్నికయ్యారు. జిల్లాకేంద్రంలో నిర్వహించిన సమావేశంలో నూతన కార్యవర్గాన్ని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ గౌరవ సలహాదారుడిగా చింతకింది రమేశ్, ఉపాధ్యక్షుడిగా కూరెందుల భాస్కర్, ప్రధాన కార్యదర్శిగా అమృతపు పవన్, కోశాధికారిగా ఇమ్రాన్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికై న బాధ్యులు మాట్లాడుతూ.. ఈ–పంచాయతీ సిబ్బంది, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి, వారి హక్కుల సాధనకు నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని ఈ–పంచాయతీ ప్రతినిధులు సభ్యులు పాల్గొన్నారు.
రామప్పలో
జియోలాజికల్ అధికారులు
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని శనివారం జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అడిషనల్ డైరెక్టర్ జనరల్ వీవీ ముఘల్, డిప్యూటీ డైరెక్టర్ శేషాసాయిలు సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామికి వారు పూజలు నిర్వహించగా అర్చకులు హరీశ్‌శర్మ, ఉమాశంకర్‌లు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ చరిత్ర, శిల్పకళ ప్రాముఖ్యత గురించి టూరిజం గైడ్ గోరంట్ల విజయ్‌కుమార్ వారికి వివరించారు. వారి వెంట జీఎస్‌ఐ అధికారులు, సిబ్బంది, ఈవో ఇమ్మడి భాస్కర్, టూరిస్ట్ పోలీసులు అరుణ్, శ్రీకాంత్, భద్రు ఉన్నారు.


