కాళేశ్వరం: శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు శుక్రవారం జిల్లావ్యాప్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగాశ్రీకృష్ణుడి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు ప్రైవేట్ పాఠశాలల్లోనూ వేడుకలు నిర్వహించారు. కృష్ణుడు, గోపిక, రాధ వేషధారణలో ఆకట్టుకున్నారు. ఉట్టి కొట్టే కార్యక్రమంలో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. పలు ప్రాంతాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
కాళేశ్వరం దేవస్థానం నిర్మాణాల వేగిరం
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థానం జీర్ణోద్ధరణలో భాగంగా విజయగణపతి ఆలయం నైరుతి మూలన నిర్మిస్తున్న విషయం తెలిసిందే. రూ.198కోట్లతో ఆలయ నిర్మాణాలు చేపట్టారు. శుక్రవారం స్టోన్‌తో బేస్‌మెంట్ 12ఫీట్ల నుంచి నిర్మాణం చేపట్టారు. వెనుకాల ప్రాకారం నిర్మిస్తున్నారు. దీంతో పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
టీచర్స్ డే వేడుకలకు బ్రేక్!
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో శనివారం నిర్వహించాల్సిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అనూహ్యంగా వాయిదా పడ్డాయి. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తమ సేవలందించిన ఉద్యోగులు, ఉపాధ్యాయులను సత్కరించేందుకు ఏర్పాట్లు చేసినప్పటికీ.. ఎంపిక చేసిన ఉత్తమ ఉద్యోగుల జాబి తాపై ఉన్నతాధికారుల సంతకాలు పూర్తికాకపోవడంతో కార్యక్రమానికి బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. జిల్లాస్థాయిలో నిర్వహించాల్సిన వేడుకలకు అధికారులు ఏర్పాట్లు చేసినప్పటికీ చివరి నిమిషంలో కార్యక్రమం నిలిచిపోవడంతో ఉపాధ్యాయులు, ఉద్యోగుల్లో చర్చనీయాంశంగా మారింది. కార్యక్రమాన్ని తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై కూడా స్పష్టత లేకపోవడం గమనార్హం. అధికారికంగా కొత్త తేదీని ప్రకటించాల్సి ఉంది.
ఘనంగా అభిషేకం
రేగొండ: మండలంలోని కొడవటంచ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామి వారికి వైభవంగా అభిషేకం జరిపించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారికి ప్రతీ శుక్రవారం అభిషేకం నిర్వహిస్తున్నట్లు ఈఓ శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ మాజీ చైర్మన్ సంపత్‌రావు, సర్పంచ్ మొగిళి, తదితరులు పాల్గొన్నారు.
కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలో కార్మికులు, కాలనీవాసులు ఎదుర్కొంటున్న ఏడు ప్రధాన సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బీఎంఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం జీఎం కార్యాలయం ఎదుట ఒకరోజు నిరసన దీక్షను ప్రారంభించి మాట్లాడారు. కార్మికులు, వారి కుటుంబాలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలని, కాలనీల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమా ండ్ చేశారు. భూపాలపల్లి ప్రాంతంలో బైపాస్ రోడ్డు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ దీక్షలో ఏరియా బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ వెలబోయిన సుజేందర్, కేంద్ర కమిటీ నాయకులు పి.మల్లేశ్, కె.శ్రీనివాస్, బ్రాంచ్ నాయకులు లక్ష్మణ్, రాజ్‌నాయక్, పునీత్‌రావు, శ్రీను పాల్గొన్నారు.


