● మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
భూపాలపల్లి అర్బన్: సింగరేణి కార్మికుల సమస్యలు తెలుసుకునేందుకు వస్తే గేట్లు వేసి అడ్డుకోవడం సరికాదని.. అడ్డుకున్నంత మాత్రాన పోరాటం ఆగదని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. శుక్రవారం ఏరియాలోని కేటీకే–5వ గనిలో కార్మికులతో నిర్వహించిన గేట్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. కార్మికులకు అవసరమైన షూస్, పనిముట్లు, డ్రిల్ బిట్స్ తదితర సామగ్రి సక్రమంగా అందడం లేదన్నారు. సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు సరఫరా చేసిన బొగ్గుకు సంబంధించిన బకాయిలు సకాలంలో చెల్లించకపోతే సంస్థ ఆర్థికంగా ఎలా నిలదొక్కుకుంటుందని ప్రశ్నించారు. బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చుకుంటే తప్ప కార్మికులకు జీతాలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఇది సంబరాల సమయం కాదని.. ఆత్మపరిశీలన సమయమన్నారు.


