భూపాలపల్లి అర్బన్: ఎన్నికల ముందు సింగరేణి కార్మికులకు అరచేతిలో స్వర్గం చూపించిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొండిచేయి చూపుతోందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి విమర్శించారు. గురువారం ఏరియాలోని కేటీకే–1వ గనిలో బీఆర్‌ఎస్, టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన గేట్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. హామీల అమలుపై ప్రజల్లో చైతన్యం కల్పిస్తామన్నారు. విధుల్లో ఉండగా అనారోగ్యానికి గురైన కార్మికులకు మెడికల్ ఇన్వాలిడేషన్ కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. మెడికల్ బోర్డులు ఏర్పాటు చేయడంలో జాప్యం చేయడంతో పాటు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న కార్మికులను కూడా తిరస్కరిస్తున్నారని అన్నారు. దీంతో అనారోగ్య కార్మికుల్లో ఆందోళన నెలకొందన్నారు. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలను ప్రజలకు గుర్తుచేస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో వారం రోజులపాటు ‘సమరభేరి’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హామీల అమలుపై ప్రజల్లో చైతన్యం తీసుకొస్తామని చెప్పారు. బీఆర్‌ఎస్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లను మున్సిపల్ అధికారులు తొలగించడాన్ని తప్పుబట్టారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, బీఆర్‌ఎస్ పట్టణ నాయకులు, టీబీజీకేఎస్ నాయకులు, సింగరేణి కార్మికులు పాల్గొన్నారు.


