భూపాలపల్లి రూరల్: వ్యవసాయం రోజురోజుకూ భారంగా మారుతోంది. ఆరుగాలం కష్టపడే రైతన్నలకు కష్టాలు తప్పటం లేదు. అతివృష్టి, అనావృష్టితో పాటు కూలీల కొరత, పెరిగిన ఎరువుల ధరలతో పాటు యాంత్రీకరణలో వెనుకంజ వెరసి సాగంటేనే అన్నదాతలు ఆందోళన చెందే పరిస్థితి వచ్చింది. పెరిగిన ధరలకు అనుగుణంగా కూలి రేట్లను పెంచుతుండటంతో రైతులకు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. తప్పని పరిస్థితుల్లో బతుకుదెరువు కోసం సాగు ఊబిలో దిగి అష్టకష్టాలు పడుతున్నారు.
ప్రధాన పంటలకు ప్రాధాన్యం
జిల్లాలో చెరువులు, బోరుబావుల కింద వరితో పాటు పత్తి, మిర్చి, మొక్కజొన్న ఇతర పంటలను సాగుచేస్తున్నారు. ఈ క్రమంలో ఉన్న కొద్దిపాటి భూములను ఎవరికి వారు సాగు చేస్తుండటంతో కూలీల కొరత అధికమైంది. ఎకరం భూమిలో దుక్కులు దున్నడం, నాట్లు వేయటం, మందు చల్లటం వంటి పనులు చేయాలంటే సుమారు 12మంది కూలీల అవసరం ఉంటుంది. ఇక పత్తి, మిర్చి పంటల్లో 20మంది వరకు కూలీల అవసరం ఉంటుంది. కానీ ఎవరి పొలాలను వాళ్లు సాగు చేస్తుండటంతో కూలీల కొరత అధికంగా ఉంది. దీంతో పరిసర పట్టణ ప్రాంతాల నుంచి కూలీలను తీసుకురావాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు.
అమాంతం పెరిగిన రేట్లు..
మారుతున్న కాలంలో పాటు పెరిగిన ధరలకు అనుగుణంగా కూలి రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. కూలీల కొరత ఉండటంతో రేట్లను అమాంతంగా పెంచేశారు. దీంతో పరిసర గ్రామాల కూలీలకు అడిగినంత కూలి చెల్లిస్తూ ప్రత్యేక వాహనాల్లో తీసుకురావాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. గతేడాది మహిళలకు కూలి రూ.300 వరకు ఉండేది. ఈ ఏడాది ఏకంగా రూ.400నుంచి రూ.500 వరకు పెరిగింది. పురుషులకు రూ.700 నుంచి రూ.900 వరకు చెల్లించాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు.
అందుబాటులోలేని యంత్రాలు
వరి సాగుకు ఒక్క ట్రాక్టర్లు మాత్రం దున్నడానికి తప్పా.. కూలీల కొరతను అధిగమించేందుకు ఇతర యంత్రాలు ఏవీ ఈ ప్రాంతంలో అందుబాటులో లేవు. కొన్నిచోట్ల గొర్రు ట్రాక్టర్‌తో వేస్తున్నా.. అందుబాటులో లేనివారు ఇబ్బందులు పడుతున్నారు. నాట్లు వేసే యంత్రాలు మార్కెట్‌లోకి వచ్చినా స్థానికంగా ఇంకా వాడకంలోకి రాలేదు. దీంతో కూలీల వినియోగం తప్పనిసరి అయింది. దున్నడానికి మినహా అంచులు తీయడం, గొర్రు, నాటు వేయడం అన్నింటికి కూడా కూలీల అవసరం తప్పదు. దీంతో వారికి డిమాండ్ బాగా పెరిగింది. ఎరువుల ధరలు కూడా దాదాపు బస్తాకు రూ.200 నుంచి రూ.300 వరకు పెరగడంతో రైతులపై అదనపు భారం పడుతోంది.
అమాంతం పెరిగిన కూలీల రేట్లు
పెరిగిన ఎరువుల ధరలు
రూ.900 వరకు డిమాండ్


