కాళేశ్వరం(మల్హర్): మల్హర్ మండలం నాచారం గ్రామపంచాయతీని అదనపు కలెక్టర్ విజయలక్ష్మి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి, లబ్ధిదారులు త్వరితగతిన నిర్మాణ పనులు పూర్తి చేసుకోవాలని సూచించారు. అనంతరం ఆన్సన్‌పల్లి గ్రామపంచాయతీ పరిధిలో జరుగుతున్న ఫాంపాండ్ పనులను సందర్శించి కూలీలకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ క్రాంతికుమార్, హౌసింగ్ డీఈ శ్రీకాంత్, ఏఈ రజినీకాంత్, ఎంపీఓ మల్లికార్జున్, ఏపీఓ గిరి హరీశ్ పాల్గొన్నారు.
నిబంధనల మేరకు
షాపులు నిర్వహించాలి
గణపురం: ప్రభుత్వ నిబంధనల మేరకు మెడికల్ షాపులు నిర్వహించాలని జిల్లా డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పావని ఆదేశించారు. బుధవారం గణపురం మండలకేంద్రంలో పలు మెడికల్ షాపులను ఆమె తనిఖీ చేశారు. షాపులలో మందులను ఆమె పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అర్హత కలిగిన ఫార్మసిస్టులు మెడికల్ దుకాణాలలో ఉండాలన్నారు. ప్రభుత్వ నిబంధనలకు లోబడి మాత్రమే మందుల విక్రయాలు చేయాలని.. లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్రగ్ ఇన్‌స్పెక్టర్ తనిఖీలు చేస్తున్నారన్నా విషయం తెలుసుకున్న పలువురు మందుల షాపులను మూసివేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కాటారం ఆర్డీఓకు గుండెపోటు
కాళేశ్వరం(కాటారం): కాటారం ఆర్డీఓ డి.రవిందర్ మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌లో కార్యాలయ పనుల్లో నిమగ్నమై ఉండగా గుండెపోటు రావడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే సిబ్బంది ఆయనను స్థానిక ఓ ఆస్పత్రికి తరలించారు. ఈసీజీతోపాటు ఇతర పరీక్షలు చేశారు. అనంతరం హనుమకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో రాత్రి గుండెకు ఒక స్టంట్ వేసినట్లు అధికారుల ద్వారా తెలిసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. నాలుగు నెలల కిందట సబ్‌కలెక్టర్ మయాంక్‌సింగ్ బదిలీ కావడంలో ఆయన స్థానంలో ఆర్డీఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మంగళవారం కాటారం సబ్‌కలెక్టర్‌గా సౌరభ్‌శర్మను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడిన విషయం తెలిసిందే.
మలేషియాలో ఉద్యోగాలకు అవకాశం
భూపాలపల్లి అర్బన్: తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ, తెలంగాణ ప్రభుత్వం కార్మిక, ఉపాధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో మలేషియాలో వివిధ ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు నియామక ప్రక్రియ చేపడుతున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి మల్లయ్య బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మలేషియాలో అందుబాటులో ఉన్న ఉద్యోగాల్లో హౌస్ వర్కర్, పైప్ ఫిట్టర్, స్వీపర్, కుక్, ఎక్స్కవేటర్–బ్యాక్‌హో ఆపరేటర్ పోస్టులు ఉన్నాయి. 10వ తరగతి, ఇంటర్, డిప్లొమా, ఐటీఐ విద్యార్హత ఉన్న వారు అర్హులని అన్నారు. అభ్యర్థుల వయస్సు 20నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలని సూచించారు. నైపుణ్యం కలిగిన వారికి నెలకు రూ.40వేల నుంచి రూ.47వేల వరకు వేతనం లభించే అవకాశం ఉందని తెలిపారు. ఎంపికై న అభ్యర్థులకు వసతి, ఇతర సౌకర్యాలు నిబంధనల ప్రకారం ఉంటాయని పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం టీఓఎంసీఓఎం అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని లేదా 080 35524946 నంబర్‌లో వివరాలు తెలుసుకోవాలని జిల్లా ఉపాధి అధికారి సూచించారు.
కేవీలో ప్రవేశాలకు
దరఖాస్తుల ఆహ్వానం
ములుగు: వెంకటాపురం(ఎం) మండలం జవహర్‌నగర్‌లోని తెలంగాణ ఆదర్శ పాఠశాల ప్రాంగణంలో నూతనంగా ప్రారంభమైన కేంద్రీయ విద్యాలయంలో 2026–27 విద్యా సంవత్సరానికి ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ సీతారాం బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 5వ తేదీలోగా అర్హులైన విద్యార్థుల తల్లిదండ్రులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


