కాళేశ్వరం (కాటారం): డిజిటల్ భూ రీ సర్వే పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ రాహుల్‌శర్మ అధికారులను ఆదేశించారు. కాటారం మండలం ధన్వాడ గ్రామంలో కొనసాగుతున్న డిజిటల్ భూ రీ–సర్వే పనులను బుధవారం కలెక్టర్ తనిఖీ చేశారు. సర్వే వివరాలను ఏడీ కుసుమకుమారిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 70 గ్రామాల్లో కొనసాగుతున్న డిజిటల్ భూ పునఃసర్వే పనులను వేగవంతం చేసి మొదటి విడత సర్వేను నవంబర్ నాటికి పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. సర్వే పనుల్లో వేగం పెంచాలని చెప్పారు. ప్రతీ మండలంలో రీ సర్వే పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సర్వే ప్రక్రియను పారదర్శకంగా, ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తూ నిర్దేశిత లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. లైసెన్స్‌డ్ సర్వేయర్లలో 54మంది విధులకు హాజరు కావడం లేదని ఏడీ కుసుమకుమారి కలెక్టర్ దృష్టికి తీసుకురాగా వారికి కౌన్సెలింగ్ నిర్వహించి విధులకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించడమే డిజిటల్ భూ సర్వే ప్రధాన ఉద్దేశమని తెలిపారు. సర్వే సమయంలో రైతులు తమ భూములకు సంబంధించిన వివరాలు, రికార్డులను అందుబాటులో ఉంచి సర్వే బృందాలకు పూర్తి సహకారం అందించాలని చెప్పారు. కలెక్టర్ వెంట సర్వేఅండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ కుసుమ కుమారి, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ నవీన్‌రెడ్డి, సర్వే సిబ్బంది, లైసెన్స్‌డ్ సర్వేయర్లు, రైతులు పాల్గొన్నారు.
భవనాల పరిశీలన
కాళేశ్వరం: మహదేవపూర్ మండలకేంద్రంలో ఫైర్‌స్టేషన్, తహసీల్దార్ కార్యాలయ భవనాల ప్రారంభోత్సవాలకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాహుల్‌శర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం ఫైర్‌స్టేషన్, తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని పరిశీలించారు. మౌలిక వసతులు, పార్కింగ్ సౌకర్యం తదితర అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఫైర్‌స్టేషన్ ప్రాంగణాన్ని పరిశీలించిన కలెక్టర్ అత్యవసర సమయాల్లో ఫైర్ ఇంజన్లు, విపత్తు నిర్వహణ వాహనాలు సులభంగా రాకపోకలు సాగించేలా పార్కింగ్, ప్రాంగణం అనువుగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీఆర్ ఈఈ విద్యాసాగర్, ఎంపీడీఓ రవీంద్రనాధ్, అగ్నిమాపక అధికారి నాగరాజు, డీటీ యూసఫ్ పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్ శర్మ


