భూపాలపల్లి అర్బన్: ఎన్నికల ముందు ఆరు గ్యారంటీలు, 420 హామీలు, 13 డిక్లరేషన్ల పేరుతో ప్రజలకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజులు పూర్తయినా అమలు చేయడంలో విఫలమైందని బీఆర్‌ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ గండ్ర జ్యోతి ఆదేశాల మేరకు పార్టీ మాజీ మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో సమరభేరి కార్యక్రమం నిర్వహించారు. 420 అడుగుల ఫ్లెక్సీ ర్యాలీ, రాస్తారోకో, బాకీ కార్డుల పంపిణీ చేపట్టారు. నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లోనూ బీఆర్‌ఎస్ శ్రేణులు నిరసనలు చేపట్టాయి. మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, రైతు రుణమాఫీ, రైతుభరోసా, రైతుబీమా, రూ.500కే గ్యాస్ సిలిండర్, నిరుద్యోగులకు ఉద్యోగాలు, భృతి తదితర హామీలను ఏం చేశారని ప్రశ్నించారు. రైతులకు రూ.41 వేల కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పి అరకొరగా చేశారని ఆరోపించారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, బీమా సౌకర్యం కల్పిస్తామని ఇచ్చిన హామీని కూడా ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. హామీలను తక్షణమే అమలు చేయాలని, లేకపోతే దశలవారీగా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు జనార్దన్, హరీశ్‌రెడ్డి, సాగర్‌రెడ్డి, రఘుపతిరావు, రాజు, నారాయణ, సిద్దు పాల్గొన్నారు.


