● ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్
భూపాలపల్లి: రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ఆగస్టు నెలలో అరైవ్ అలైవ్ ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమం నిర్వహించి 256 కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆగస్టు 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో 256 కేసులు నమోదు చేసి 187 వాహనాలను సీజ్ చేశామన్నారు. అందులో 69 గూడ్స్ క్యారియర్ వాహనాలను సీజ్ చేశామని తెలిపారు. ఆయా వాహనదారులకు రూ.13.70 లక్షల జరిమానా విధించినట్లు చెప్పారు. ప్రతీ వాహనదారుడు తప్పనిసరిగా ఐఎస్‌ఐ ప్రమాణాల హెల్మెట్ ధరించాలని, సీటుబెల్ట్ వినియోగించాలని, నిర్ణీత వేగ పరిమితులను పాటించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయవద్దని ఎస్పీ సంకీర్త్ సూచించారు.


