● అధిష్టానం నుంచి పిలుపు..
హుటాహుటిన ఢిల్లీకి మంత్రి సురేఖ
● కొనసాగిస్తారా? లేక తప్పిస్తారా..?
● ఓరుగల్లు కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్కంఠ
సాక్షి ప్రతినిధి, వరంగల్ : కాంగ్రెస్‌లో కొంతకాలంగా కొనసాగుతున్న మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ ఇప్పుడు క్లైమాక్స్‌కు చేరినట్లే కనిపిస్తోంది. పార్టీ అధిష్టానం నుంచి పిలుపు రావడంతో ఆమె మంగళవారం హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరడం రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ వర్గాల్లోనూ తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తోపాటు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఆమె కలిసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఢిల్లీ పర్యటనకు వెళ్లిన నేపథ్యంలో సురేఖకు అధిష్టానంనుంచి వచ్చిన పిలుపు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
అసలు ఏం జరుగుతోంది?
మంత్రి సురేఖ కుమార్తె సుస్మిత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్యలతో వివాదం ముదిరిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సురేఖకు నోటీసు జారీ చేసి వివరణ కోరింది. అనంతరం కమిటీ నివేదికను అధిష్టానానికి పంపినట్లు కూడా పీసీసీ ప్రకటించిన విషయం విధితమే. ఇదే సమయంలో మంత్రి సురేఖ, ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య ఉన్న విభేదాలు కూడా పార్టీ పెద్దల దృష్టికి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించారన్న ఆరోపణలపై క్రమశిక్షణ కమిటీ పరిశీలన జరిపినట్లు సమాచారం. దీంతో ఈ వివాదానికి రాష్ట్రస్థాయిలో కాకుండా ఢిల్లీ స్థాయిలోనే ముగింపు పలికేందుకు అధిష్టానం ప్రయత్నిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ సాగుతోంది.
మూడింట్లో ఏది..!
రాష్ట్రానికి చెందిన పలువురు ముఖ్య నేతలు కూడా ఢిల్లీకి వెళ్లనున్న నేపథ్యంలో అధిష్టానం సమక్షంలో సురేఖ అంశంపై విస్తృతంగా చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. అధిష్టానం ఈ వ్యవహారాన్ని ఇక నాన్చే ఉద్దేశంలో లేదన్న అభిప్రాయాలు రాజకీయ విశ్లేషకులనుంచి వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా అధిష్టానం ముందున్న ప్రధానంగా మూడు అవకాశాలపై వరంగల్ కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సురేఖతో నేరుగా మా ట్లాడి వివాదానికి ముగింపు పలికి, ఇకపై పార్టీ క్రమశిక్షణకు లోబడి పనిచేయాలని స్పష్టమైన హెచ్చరిక చేసే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, కొండా సురేఖ కుటుంబం మధ్య నెలకొన్న విభేదాలకు రాజకీయ పరిష్కారం చూపి, సురేఖను మంత్రిగా కొనసాగించే ప్రయత్నం జరగవచ్చన్న చర్చ కూడా ఉంది. లేదంటే క్రమశిక్షణ కమిటీ సిఫారసులను పరిగణనలోకి తీసుకుని మంత్రి పదవికి రాజీనామా చేయాలని కోరడం, లేదా కేబినెట్ మార్పుల్లో భాగంగా ఆమెను తప్పించడం వంటి కఠిన నిర్ణయం తీసుకునే అవకాశంపై కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఓరుగల్లులో హీటెక్కిన రాజకీయాలు..
సురేఖకు ఢిల్లీ పిలుపు రావడంతో ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్‌లో ఒక్కసారిగా చర్చ మొదలైంది. పార్టీ నేతలు, కార్యకర్తలు తాజా పరిణామాలపై ఆరా తీస్తున్నారు. సురేఖకు ఏం జరుగుతుంది? అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుంది? మంత్రి పదవిలో కొనసాగుతారా? అన్నదే ప్రధాన చర్చగా మారింది. కొండా కుటుంబానికి ఉమ్మడి వరంగల్ రాజకీయాల్లో ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా అధిష్టానం తీసుకునే నిర్ణయం స్థానిక రాజకీయాలపై కూడా ప్రభావం చూపే అవకాశముందని పార్టీ వర్గాలు అ ంచనా వేస్తున్నాయి. ఢిల్లీ నుంచి వెలువడే నిర్ణయంతోనే ఈ రాజకీయ ఉత్కంఠకు తెరపడనుంది.


